LOADING...
Washington Sundar: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కూ ఆ ఆల్‌రౌండర్‌ దూరం 
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కూ ఆ ఆల్‌రౌండర్‌ దూరం

Washington Sundar: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కూ ఆ ఆల్‌రౌండర్‌ దూరం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు న్యూజిలాండ్‌తో వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో గాయం తగిలింది. ఆ మ్యాచ్‌లో అతడు కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసి అనంతరం మైదానం విడిచిపెట్టాడు. సుందర్‌ బయటకు వెళ్లిన తర్వాత అతడి స్థానంలో ధ్రువ్‌ జురేల్‌ ఫీల్డింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. అయితే మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సుందర్‌ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి ఏడు బంతుల్లో ఏడు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయినప్పటికీ గాయం తీవ్రత కారణంగా అతడు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అంతేకాదు, జనవరి 21 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్‌లో కూడా సుందర్‌ పాల్గొనడం లేదు. అతడి స్థానంలో ఎవరు జట్టులోకి వస్తారన్న విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

వివరాలు 

ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ 2026

ఇదిలా ఉండగా, భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీకి ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉండటంతో,అప్పటికి వాషింగ్టన్‌ సుందర్‌ పూర్తిగా కోలుకుంటాడా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యువ ఆటగాడు తిలక్‌ వర్మకు ఇటీవల శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. విజయ్‌ హజారే ట్రోఫీలో పాల్గొన్న సమయంలో అతడు పొత్తికడుపు నొప్పితో బాధపడటంతో ఆసుపత్రిలో చేర్పించగా, సర్జరీ తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది.

వివరాలు 

వరల్డ్‌ కప్‌కు ముందు ఇండియా కీలక ఆటగాళ్లకు గాయాలు 

మెగా టోర్నీ నాటికి అతడు కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ నేపథ్యంలో వరల్డ్‌ కప్‌కు ముందే టీమ్‌ ఇండియాను కీలక ఆటగాళ్ల గాయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరల్డ్‌ కప్‌ జట్టులో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఐసీసీ జనవరి 31ని తుది గడువుగా నిర్ణయించింది. అయితే టోర్నమెంట్‌ మధ్యలోనూ ఐసీసీ అనుమతి తీసుకుని రీప్లేస్‌మెంట్‌ ఆటగాళ్లను చేర్చుకునే అవకాశం ఉన్నట్లు నిబంధనలు చెబుతున్నాయి.

Advertisement