GT Vs MI: ముంబైకి బిగ్ షాక్.. ఫైనల్‌కు చేరిన గుజరాత్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజృంభించింది. ముంబై పై 62 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోరును చేసింది. గుజరాత్ స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 60 బంతుల్లో (7 ఫోర్లు, 10 సిక్సర్లు) 124 పరుగులతో విజృంభించాడు. ఫోర్లు, సిక్స్‌లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతనికి తోడు సాయి సుదర్శన్ 43, హార్ధిక్ పాండ్యా 28రన్స్ తో రాణించారు. ఈ సీజన్లో గిల్ మూడో సెంచరీని నమోదు చేశాడు. ముంబై బౌలర్లలో చావ్లా, ఆకాష్ తలా ఓ వికెట్ తీశారు.
ఐదు వికెట్లతో చెలరేగిన మోహిత్ శర్మ
గుజరాత్ నిర్ధేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని ముంబై చేధించలేకపోయింది. 18.2 ఓవర్లలో 171 రన్స్ చేసి ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 61, తిలక్ వర్మ 43, కామరూన్ గ్రీన్ 30 రన్స్ తో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచులో రోహిత్ శర్మ 8, వధేరా 4, విష్ణు వినోద్ 5 పరుగులతో పూర్తిగా నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 5 వికెట్లు తీసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం చైన్నై, గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.