IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీ వచ్చేసింది.. వేలంలో 1574 మంది ఆటగాళ్లు
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి కీలక సమాచారం వెల్లడైంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాబోయే సీజన్ల కోసం జట్టును బలోపేతం చేసుకోవడానికి ప్రతి ఫ్రాంచైజీ అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను కలుపుకోగలదు. ఈ మెగా వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లను తీసుకోనున్నారు. నవంబర్ 4తో ఈ వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
వేలానికి సంబంధించిన సమాచారం
ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు ఉండగా, 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం జాబితాలో 320 మంది క్యాప్డ్ ఆటగాళ్లు, 1,224 మంది అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు, 30 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఆటగాళ్ల విభాగాలు క్యాప్డ్ ఇండియన్ ఆటగాళ్లు: 48 అంతర్జాతీయ ఆటగాళ్లు: 272 గత సీజన్లలో ఆడిన అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు: 152 గత సీజన్లలో ఆడిన అన్‌క్యాప్డ్ అంతర్జాతీయ ఆటగాళ్లు: 3 అన్‌క్యాప్డ్ ఇండియన్ ఆటగాళ్లు: 965 అన్‌క్యాప్డ్ అంతర్జాతీయ ఆటగాళ్లు: 104
వేలంలో ఏ దేశానికి చెందిన ఎంత మంది ఆటగాళ్లు పాల్గొంటారు?
జింబాబ్వే 8, వెస్టిండీస్ 33, యూఎస్ఏ 10, యూఏఈ 1, శ్రీలంక 29, దక్షిణాఫ్రికా 91, స్కాట్లాండ్ 2, న్యూజిలాండ్ 39, నెదర్లాండ్స్ 12, ఇటలీ 1, ఐర్లాండ్ 9, ఇంగ్లండ్ 52, కెనడా 4, బంగ్లాదేశ్ నుంచి 13, ఆస్ట్రేలియా నుంచి 76 మంది, ఆఫ్ఘనిస్థాన్ నుంచి 29 మంది వేలంలో భాగం కానున్నారు. ఈ వేలం కొనసాగుతుండగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మధ్య తొలి టెస్టు మ్యాచ్ కొనసాగనుంది.
రిటెన్షన్ వివరాలు
గత వారం విడుదలైన రిటెన్షన్ జాబితాలో అత్యధిక ధర కలిగిన ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) రూ.23 కోట్ల ధరతో నిలిచాడు. ఆర్సీబీ విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇతర ఫ్రాంచైజీలు కూడా తమ ప్రియమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి: రోహిత్ శర్మ రూ.16.30 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ - రూ.18 కోట్లు, యశస్వి జైస్వాల్ - రూ.18 కోట్లు. గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్‌ను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకోగా, ముంబయి ఇండియన్స్ జస్‌ప్రీత్ బుమ్రా - రూ.18 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.18 కోట్లకు తీసుకున్నారు.