IPL 2026: మ్యాచ్‌కు ముందు భారీ కుట్ర.. చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం.. 240 సీసీ కెమెరాల ధ్వంసం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సందర్భంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో భద్రతా లోపం బయటపడింది. ఈ నెల 24న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు స్టేడియం నిఘా వ్యవస్థను కావాలనే ధ్వంసం చేసిన ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వల్ల దాదాపు 240 సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయాయి. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం చిత్రదుర్గ జిల్లా హిరియూర్‌కు చెందిన మంజునాథ్ (37), ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ కలాం (19) ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తించారు. వీరు స్టేడియం డిజిటల్ సర్వైలెన్స్ నిర్వహిస్తున్న ఐవీఎస్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థకు సబ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు.
వివరాలు
డబ్బులు చెల్లించలేదని ఆ పని..
డీయాక్టివేట్ అయిన యాక్సెస్ కార్డును ఉపయోగించి నిందితులు ఉదయం 11:30 గంటలకు స్టేడియంలోని సీసీటీవీ కంట్రోల్ రూమ్, సర్వర్ రూమ్ వంటి నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించారు. అనంతరం అక్కడ ఉన్న నెట్‌వర్క్ వీడియో రికార్డర్లు (ఎన్‌వీఆర్‌లు), ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లను ధ్వంసం చేశారు. దీంతో ఎంట్రీ గేట్లు, కాన్కోర్సులు, డీ కార్పొరేట్ స్టాండ్ వంటి కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు నిలిచిపోయాయి. తమకు రావాల్సిన రూ.10 లక్షల బకాయిలు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఈ కారణంపై పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్ల పర్యవేక్షణలో జరిగిన లోపాలు, యాక్సెస్ కంట్రోల్ విధానాల వైఫల్యాలపై కూడా విచారణ కొనసాగుతోంది.
వివరాలు
కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు..
స్టేడియం నిఘా వ్యవస్థలకు సంబంధించిన స్టాక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి ఆదిత్య భట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్యూబన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులు నిషేధిత ప్రాంతాల్లో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తైంది. ఇక ఐపీఎల్ 2026 షెడ్యూల్ ప్రకారం ఆర్‌సీబీ బెంగళూరులోని హోం మ్యాచ్‌లన్నీ ముగించగా, మిగిలిన మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.