LOADING...
IPL 2026 : సెహ్వాగ్-గంభీర్ రికార్డుకు ఎండ్ కార్డ్..రికార్డు తిరగరాయనున్న జైస్వాల్-వైభవ్ జోడీ
సెహ్వాగ్-గంభీర్ రికార్డుకు ఎండ్ కార్డ్..రికార్డు తిరగరాయనున్న జైస్వాల్-వైభవ్ జోడీ

IPL 2026 : సెహ్వాగ్-గంభీర్ రికార్డుకు ఎండ్ కార్డ్..రికార్డు తిరగరాయనున్న జైస్వాల్-వైభవ్ జోడీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 04, 2026
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో టైటిల్ సాధించిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత మళ్లీ ట్రోఫీ గెలవకపోయినా, భారత క్రికెట్‌కు ప్రతిభావంతమైన ఆటగాళ్లను అందించడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో యువ ప్రతిభను గుర్తించి మెరుగుపరచడంలో ఈ జట్టు ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఇద్దరు యువ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లకు సవాల్‌గా మారుతున్నారు. వారు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. ఈ చురుకైన జంట ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు.

వివరాలు 

ఆ రికార్డును బ్రేక్ చేస్తారా? 

ఈ రోజు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి రాజస్థాన్ ఓపెనర్లు జైస్వాల్, వైభవ్‌లపై నిలిచింది. ఓపెనింగ్ భాగస్వామ్యంలో వీరు ఒక పెద్ద రికార్డును చేధించే అవకాశంలో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప బంతుల్లో 500 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా నిలవడానికి వీరు దగ్గరలోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ రికార్డు ఢిల్లీ జట్టుకు చెందిన వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పేరిట ఉంది. ఆ రికార్డును అధిగమించడానికి రాజస్థాన్ జంటకు కేవలం 3 పరుగులు చాలు. ఇప్పటివరకు జైస్వాల్-వైభవ్ జోడీ 246 బంతుల్లోనే 497 పరుగులు జోడించింది. ఇక సెహ్వాగ్-గంభీర్ జంట 309 బంతుల్లో 500 పరుగుల మైలురాయిని చేరుకుంది.

వివరాలు 

ఆందోళన చెందుతున్న బౌలర్లు..

మ్యాచ్ తొలి బంతికే బౌండరీ కొట్టినా, అతి తక్కువ బంతుల్లో 500 పరుగులు పూర్తి చేసిన అత్యంత దూకుడైన ఓపెనింగ్ జోడీగా చరిత్రలో నిలుస్తారు. వీరిద్దరి స్ట్రైక్ రేట్ కూడా బౌలర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే కలిపి 200కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తున్నారు. కేవలం 14 ఏళ్లకే ఐపీఎల్‌లో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు 15 ఏళ్ల వయసులోనే తన దూకుడైన బ్యాటింగ్‌తో మళ్లీ మెప్పిస్తున్నాడు. మరోవైపు అనుభవం ఉన్న యశస్వి జైస్వాల్ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకొని, రాజస్థాన్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.

Advertisement