LOADING...
IPL 2026 Playoffs: హైదరాబాద్‌కు షాక్.. గుజరాత్ గెలుపుతో మారిన ప్లేఆఫ్స్ లెక్కలు
హైదరాబాద్‌కు షాక్.. గుజరాత్ గెలుపుతో మారిన ప్లేఆఫ్స్ లెక్కలు

IPL 2026 Playoffs: హైదరాబాద్‌కు షాక్.. గుజరాత్ గెలుపుతో మారిన ప్లేఆఫ్స్ లెక్కలు

వ్రాసిన వారు Moogati Shabari
May 13, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక్క విజయం గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ చేయగా.. మరో మూడు జట్లకు మాత్రం టెన్షన్ పెంచింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించి ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో బలమైన స్థానం సంపాదించింది. ఈ విజయంతో గుజరాత్ 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. సాధారణంగా ఐపీఎల్‌లో 16 పాయింట్లు ప్లేఆఫ్స్ బెర్త్‌కు సరిపోతాయని భావిస్తారు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ల అంచనాల ప్రకారం, ఈ గెలుపుతో గుజరాత్ ప్లేఆఫ్స్ అవకాశాలు 94.9 శాతానికి పెరిగాయి.

వివరాలు

మారిన ప్లేఆఫ్స్ అవకాశాలు..

అయితే ఈ మ్యాచ్ ఫలితం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పెద్ద షాక్‌గా మారింది. మ్యాచ్‌కు ముందు 80 శాతం ఉన్న ఆ జట్టు క్వాలిఫికేషన్ అవకాశాలు ఓటమి తర్వాత 65.7 శాతానికి పడిపోయాయి. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి కూడా కాస్త ఆందోళనకరంగా మారింది. ఆర్సీబీ అవకాశాలు 80.1 శాతం నుంచి 79.7 శాతానికి తగ్గాయి. పంజాబ్ కింగ్స్ మాత్రం స్వల్పంగా మెరుగుపడి 62.7 శాతానికి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ప్రస్తుతం 42.8 శాతంగా నమోదయ్యాయి.

వివరాలు

ఇన్నింగ్స్ సాగిందిలా...

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కగిసో రబడా తన వేగవంతమైన బౌలింగ్‌తో టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. అతడు 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పాడు. మహమ్మద్ సిరాజ్ కీలక సమయంలో ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసి జట్టుకు మంచి బ్రేక్ ఇచ్చాడు. జేసన్ హోల్డర్ మూడు వికెట్లతో మధ్యవరుసను దెబ్బతీయగా, ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో హైదరాబాద్ జట్టు కేవలం 14.5 ఓవర్లలోనే 86 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కమిన్స్ చేసిన 19 పరుగులే జట్టులో అత్యధిక స్కోరుగా నిలిచాయి.

Advertisement

వివరాలు

చెలరేగిన సాయి సుదర్శన్..

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ కూడా ఒక దశలో ఇబ్బందుల్లో పడింది. అయితే సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును గట్టెక్కించారు. సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు వాషింగ్టన్ సుందర్ 33 బంతుల్లో 50 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడు 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

Advertisement