IPL 2026: కింగ్ అదుర్స్.. ఆర్సీబీకి మరో ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ప్లేఆఫ్స్ దిశగా మరొక కీలక అడుగు వేసింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చాటిన డిఫెండింగ్ ఛాంపియన్ తన ఎనిమిదో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో మెరవడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ పై సునాయాస విజయాన్ని సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఆరో పరాజయం మూటగట్టుకున్న కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తు చేసింది.
వివరాలు
చెలరేగిన కోహ్లీ..
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌కు రఘువంశీ 46 బంతుల్లో 71 పరుగులు చేసి మెరుగైన స్కోరు అందించగా, రింకు సింగ్ 29 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. వారి పోరాటంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లి అద్భుత శతకంతో చెలరేగిపోయాడు. అతడు 60 బంతుల్లో 105 పరుగులు చేసి చివరివరకు అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. దేవ్‌దత్ 27 బంతుల్లో 39 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. ఫలితంగా బెంగళూరు 19.1 ఓవర్లలోనే 4 వికెట్లకే లక్ష్యాన్ని చేరుకుంది.
వివరాలు
ఇన్నింగ్స్ సాగిందిలా..
ఛేదన ప్రారంభంలో ఓపెనర్ బెతెల్ 15 పరుగులకే వెనుదిరిగినా, కోహ్లి మాత్రం దూకుడుగా ఆడుతూ జట్టును విజయపథంలో నడిపించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన అతడు ఈసారి తన క్లాస్‌ను చూపించాడు. అవకాశం దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. వైభవ్ అరోరా వేసిన ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాదిన కోహ్లి, కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టాడు. మరోవైపు పడిక్కల్ కూడా దూకుడుగా ఆడాడు. త్యాగి, నరైన్ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. పదో ఓవరుకు ఆర్సీబీ స్కోరు 100 దాటింది. కోహ్లి కేవలం 32 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు.
వివరాలు
గ్రౌండ్లో బౌండరీల వర్షం..
తర్వాత కూడా అతడు అదే దూకుడు కొనసాగించాడు. అయితే 92 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని త్యాగి చెదరగొట్టాడు. పడిక్కల్‌ను ఔట్ చేసి కేకేఆర్‌కు చిన్న ఊరటనిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పాటీదార్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, కోహ్లి మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తూ జట్టును గెలుపువైపు తీసుకెళ్లాడు. కొద్దిసేపటికే నరైన్ పాటీదార్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. చివరి నాలుగు ఓవర్లలో బెంగళూరుకు 36 పరుగులు అవసరమైన సమయంలో కోహ్లి మరింత దూకుడుగా మారాడు. అనుకుల్ రాయ్ ఓవర్లో ఫోర్, సిక్స్ బాది సమీకరణాన్ని సులభం చేశాడు. జితేశ్‌తో కలిసి కోహ్లి ఎలాంటి ఉత్కంఠకు తావులేకుండా మ్యాచ్‌ను ముగించాడు. 58 బంతుల్లో తన ఐపీఎల్ కెరీర్‌లో 9వ శతకాన్ని నమోదు చేశాడు.