MI vs CSK: కుప్పకూలిన ముంబై.. సీఎస్‌కేకు ఘన విజయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అద్భుతమైన రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా అత్యంత భారీ విజయాలలో ఒకటిని సాధించింది. గురువారం వాంఖడే మైదానంలో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో సమన్వయంగా రాణించిన సీఎస్‌కే, ముంబయి ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది ఐదో ఓటమి కాగా, సీఎస్‌కేకు మూడో విజయం నమోదైంది. సంజూ శాంసన్ అజేయ శతకం, అఖిల్ హోసెన్ అద్భుతమైన బౌలింగ్ (4/17) ఈ చారిత్రక విజయానికి కీలకంగా నిలిచాయి.
వివరాలు
సంజూ శాంసన్ అజేయ సెంచరీతో మెరుపులు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 నాటౌట్) ఒంటరిగా అద్భుత శతకం నమోదు చేసి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు. అయితే ఇతర బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ముంబై బౌలింగ్‌లో అశ్వని కుమార్ (2/37), అల్లా గజన్ఫర్ (2/25) ఇద్దరూ రెండు వికెట్లు చొప్పున తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ సాధించారు.
వివరాలు
ముంబై ఘోర పతనం..
లక్ష్యం 208 పరుగులు అయినా, ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 35, 5 ఫోర్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 37, 5 ఫోర్లు) మాత్రమే కొంత ప్రతిఘటన చూపారు. మిగతా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. డానిష్ మలెవర్, నమన్ ధీర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ డకౌట్ అయ్యారు. సీఎస్‌కే బౌలింగ్‌లో అఖిల్ హోసెన్ (4/17) నాలుగు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. నూర్ అహ్మద్ (2/23) రెండు వికెట్లు తీశాడు. ముఖేష్ చౌదరీ, అన్షుల్ కంబోజ్, జెమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్ కూడా తలో వికెట్ సాధించారు.
వివరాలు
పవర్ ప్లేలోనే ముంబై పని ఖతం..
208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబైకి ప్రారంభం నుంచే షాక్ తగిలింది. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టును కోల్పోయింది. మొదటి ఓవర్‌లోనే అఖిల్ హోసెన్ బౌలింగ్‌లో డానిష్ మలెవర్ (0) ఔట్ అయ్యాడు. రెండో ఓవర్‌లో ముఖేష్ చౌదరీ క్వింటన్ డికాక్ (7)ను పెవిలియన్‌కు పంపాడు. మూడో ఓవర్‌లో మరోసారి అఖిల్ హోసెన్ నమన్ ధీర్ (0)ను డకౌట్ చేయడంతో ముంబై పూర్తిగా కష్టాల్లో పడింది. తరువాత సూర్యకుమార్, తిలక్ వర్మ కొంత నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, పెరుగుతున్న రన్‌రేట్ వారిని ఒత్తిడిలోకి నెట్టింది. మిడిల్ ఓవర్లలో మళ్లీ దాడికి వచ్చిన అఖిల్ హోసెన్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి సీఎస్‌కే విజయాన్ని ఖరారు చేశాడు.