LOADING...
IPL 2026: ఎవర్రా మీరంతా.. ఫ్రాంచైజీలకే షాక్ ఇచ్చిన ఐపీఎల్ కెప్టెన్లు..!
ఎవర్రా మీరంతా.. ఫ్రాంచైజీలకే షాక్ ఇచ్చిన ఐపీఎల్ కెప్టెన్లు..!

IPL 2026: ఎవర్రా మీరంతా.. ఫ్రాంచైజీలకే షాక్ ఇచ్చిన ఐపీఎల్ కెప్టెన్లు..!

వ్రాసిన వారు Moogati Shabari
May 20, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో ఒక్క సీజన్‌ చాలు.. హీరోలను జీరోలుగా మార్చేయడానికి. ఇక్కడ గెలిస్తే ఆకాశానికెత్తేస్తారు.. ఓడితే అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కెప్టెన్లపై అంచనాలు భారీగా ఉంటాయి. కానీ ఐపీఎల్ 2026 సీజన్‌లో కొందరు కెప్టెన్లు తమ వ్యూహాలు, పేలవమైన ప్రదర్శనలతో సొంత జట్లకే భారంగా మారారు. ఫ్రాంచైజీలు ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించినా.. ఆ విశ్వాసాన్ని నిలబెట్టలేక తీవ్ర నిరాశ కలిగించారు. ఇప్పుడు ఆ నలుగురు కెప్టెన్ల గురించి తెలుసుకుందాం.

వివరాలు

మెగా వేలంలో భారీగా ఖర్చు..

లక్నో సూపర్జెయింట్స్ జట్టు మెగా వేలంలో భారీగా ఖర్చు చేసి రిషభ్ పంత్‌ను దక్కించుకుంది. దాదాపు రూ.27 కోట్లతో కొనుగోలు చేసి కెప్టెన్సీ కూడా అప్పగించింది. అయితే ఈ సీజన్‌లో పంత్ పూర్తిగా నిరాశపరిచాడు. లక్నో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్న తొలి జట్టుగా నిలవడం అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. బ్యాటింగ్‌లోనూ పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 251 పరుగులే చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ కూడా నిరాశాజనకంగానే నిలిచింది. మైదానంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన ప్రయోగాలు జట్టుకు కలిసి రాలేదు. దీంతో యాజమాన్యం కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్‌లో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వివరాలు

ప్లేఆఫ్స్ అవకాశాలు దూరం..

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా పెద్దగా భిన్నంగా లేదు. కెప్టెన్ అక్షర్ పటేల్ ఆటగాడిగా, నాయకుడిగా రెండు విభాగాల్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. టాప్ ఆర్డర్‌లో అవకాశాలు వచ్చినా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 100 పరుగులే నమోదు చేశాడు. బౌలింగ్‌లోనూ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోలేదనే విమర్శలు వచ్చాయి. 12 మ్యాచ్‌ల్లో కేవలం 36 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడం, కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఢిల్లీకి భారీ నష్టంగా మారింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు దూరమయ్యాయి. వచ్చే సీజన్‌లో జట్టు మేనేజ్‌మెంట్ మారనున్న నేపథ్యంలో అక్షర్ కెప్టెన్సీపై అనిశ్చితి నెలకొంది.

Advertisement

వివరాలు

టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా ఆడలేకపోయిన కెప్టెన్..

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆశించిన ఫలితాలు రాలేదు. అనుభవజ్ఞుడైన ఆటగాడైనా, టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా ఆడలేకపోయాడు. ఈ సీజన్‌లో అతడి బ్యాటింగ్ చాలా నెమ్మదిగా సాగింది. 133 స్ట్రైక్‌రేట్‌తో కేవలం 237 పరుగులే చేశాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో అతడి నెమ్మదైన బ్యాటింగ్ జట్టుపై ఒత్తిడిని పెంచింది. తన ఆటతీరుపై వచ్చిన విమర్శలను రహానే తేలికగా తీసుకున్నప్పటికీ, జట్టు ఫలితాలపై మాత్రం దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో వచ్చే మినీ వేలానికి ముందు కేకేఆర్ అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా జట్టులోనుంచే విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

వివరాలు

డ్రెస్సింగ్ రూమ్‌లో అంతర్గత విభేదాలు..

మరోవైపు ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా పెద్దగా కలిసి రాలేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఈసారి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడానికి జట్టు సీనియర్ల పేలవ ప్రదర్శన ప్రధాన కారణంగా మారింది. ముఖ్యంగా హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. గత సీజన్‌లో వచ్చిన విమర్శలే ఈసారి కూడా కొనసాగాయి. జట్టు ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే సైతం సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం జట్టును తీవ్రంగా దెబ్బతీసిందని అంగీకరించాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో హార్దిక్ నాయకత్వంపై మరోసారి చర్చ మొదలైంది.

Advertisement