IPL 2027 Auction: ఐపీఎల్ 2027 మినీ వేలం భారత్‌లోనే.. బీసీసీఐ కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. మంగళవారం (సెప్టెంబర్ 15) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలి సంవత్సరాల్లో ఐపీఎల్ వేలాలు విదేశాల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఈసారి మాత్రం వేదికను భారత్‌కు మార్చాలని బీసీసీఐ భావించింది.
వివరాలు
విదేశీ వేదికలకు స్వస్తి
2023లో కొచ్చిలో జరిగిన వేలం తర్వాత ఐపీఎల్ వేలాలు వరుసగా విదేశీ వేదికల్లోనే జరిగాయి.
దుబాయ్, జెడ్డా, అబుదాబి వంటి నగరాలు వేలానికి ఆతిథ్యమిచ్చాయి.
అయితే 2027లో మినీ వేలం జరగనున్నందున.. ఫ్రాంచైజీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్లాల్సి రావడం వల్ల ఎదురయ్యే రవాణా, వసతి, నిర్వహణ సంబంధిత సమస్యలను బీసీసీఐ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత వేలాల సమయంలో ఫ్రాంచైజీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా గవర్నింగ్ కౌన్సిల్ పరిశీలించినట్లు సమాచారం.
వివరాలు
వేదిక ఖరారుపై ఇంకా స్పష్టత లేదు
ఐపీఎల్ 2027 మినీ వేలం భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. ఏ నగరంలో జరపాలనే దానిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ఫ్రాంచైజీలు, వారి ప్రతినిధులకు తగిన వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండే నగరాన్ని ఎంపిక చేయనున్నారు.
ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు భారత్‌లో వివాహాల సీజన్ కొనసాగుతుండటంతో.. ఫైవ్ స్టార్ హోటళ్లలో గదుల లభ్యత కీలక అంశంగా మారనుంది.
బీసీసీఐకి వేలం కోసం రెండు రోజుల పాటు 100కు పైగా హోటల్ గదులు అవసరమవుతాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో హోటళ్లలో గదుల లభ్యతను పరిశీలించిన తర్వాతే వేలం నగరాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం.
వివరాలు
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై తుది నిర్ణయం వాయిదా
ఐపీఎల్‌లో అమల్లో ఉన్నఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
ఈ అంశంపై మరోసారి చర్చించాలని నిర్ణయించారు.నెల రోజుల్లో మరో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో..అప్పుడే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఇప్పటికే బీసీసీఐ ఫ్రాంచైజీల నుంచి అభిప్రాయాలను కోరింది.
చాలా జట్లు ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.అయితే మరికొన్ని ఫ్రాంచైజీలు మాత్రం మరో ఏడాది కొనసాగించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను దృష్టిలో ఉంచుకునే తాము జట్లను నిర్మించామని కొన్ని జట్లు చెబుతున్నాయి.
అందువల్ల ఈ నిబంధనను ఒక్కసారిగా తొలగించడం కంటే..వచ్చే ఏడాది దీనిపై నిర్ణయం తీసుకోవడం సముచితమని అవి భావిస్తున్నట్లు సమాచారం.