చితకబాదిన ఇషాన్ కిషన్.. ధోని రికార్డు బద్దలు
టీమిండియా కీపర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో తన మొదటి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయితే ఎఫ్‌సి క్రికెట్లో 3వేల పరుగుల మైలురాయిని ఇషాన్ కిషన్ అధిగమించాడు. ఇందులో 17 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. అదేవిధంగా టెస్టుల్లో ఇషాన్ కిషన్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. అత్యధిక వేగంగా టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా కిషన్ రికార్డు క్రియేట్ చేశాడు.
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన రెండో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2022లో శ్రీలంకపై 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. దీంతో టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ సాధించిన రెండో వికెట్ కీపర్ గా ఇషాన్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ పేరిట ఉంది. 2006లో పాకిస్థాన్ పై ధోనీ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేసిన విషయం తెలిసిందే.వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచుతో ధోనీ 17 ఏళ్ల రికార్డును కిషన్ బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో విండీస్ గెలుపొందాలంటే చివరి రోజు ఆటలో 289 పరుగులు చేయాల్సి ఉంది. అదే సమయంలో భారత్ నెగ్గాలంటే 8 వికెట్లు సాధించాల్సి ఉంది.