IND Vs WI: హాఫ్ సెంచరీతో విజృంభించిన ఇషాన్ కిషన్.. భారత్ ఘన విజయం
బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియానే విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఇద్దరు కలిసి ఏడు వికెట్లు తీయడంతో వెస్టిండీస్ 114 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ స్థానాల్లో ఆడకుండా ఇతర బ్యాటర్లను ముందుకు పంపారు. అయితే అది అశించిన ఫలితం ఇవ్వలేదు. ఒక్క ఇషాన్ కిషాన్ మాత్రమే తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
వన్డేల్లో 4వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన ఇషాన్ కిషన్
ఇప్పటివరకూ 15 వన్డే మ్యాచులు ఆడిన ఇషాన్ కిషాన్ 43.23 సగటుతో 562 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉండడం విశేషం. కిషన్ లిస్ట్ A క్రికెట్‌లో 37.93 సగటుతో 3,111 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు, ఐదు సెంచరీలను బాదాడు. 6 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టినా కుల్దీప్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం ఇదే మైదానంలో జరగనుంది.