IND vs NZ: చెలరేగిన ఇషాన్-సూర్య.. 209 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇషాన్ కిషన్ (76; 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్ (82; 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. హార్డ్ హిట్టర్ శివమ్ దూబే (36; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు) చివర్లో ధాటిగా ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సంజూ శాంసన్ (6), అభిషేక్ శర్మ (0) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
Details
2-0తో ఆధిక్యంలో భారత్
ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (47 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు సీఫర్ట్ (24), కాన్వే (19) దూకుడుగా ఆడినా, మధ్యలో ఫిలిప్స్ (19), మిచెల్ (18), చాప్‌మన్ (10) నిరాశపరిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ చొప్పున సాధించారు.