ఆ ఇద్దరు ఉంటే టీమిండియాను ఓడించడం ఆసాధ్యం
స్వదేశంలో టీమిండియాను ఓడించడం విదేశీ టీమ్ లకు ఓ కలగా మారుతోంది. భారత్ ను ఓడించాలని దిగ్గజ టీంలు, లెజెండరీ ఆటగాళ్లు కలలు కన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. 1996లో మొదలై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2004 లో మాత్రమే టీమిండియా స్వదేశంలో ఓడిపోయింది. తాజాగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా దారుణ ఓటములను మూటగట్టుకుంటున్నది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజా రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ టెస్టు ముగిశాక రమీజ్ రాజా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడారు. స్వదేశంలో భారత్ ను ఓడించడం దాదాపు ఆసాధ్యమని చెప్పారు.
సమిష్టి కృషితో టీమిండియా రాణిస్తోంది
జడేజా, అశ్విన్ అద్భుత బౌలింగ్ అదరగొడుతున్నారని, ఒకవేళ వారిద్దరు లేకుంటే ఆస్ట్రేలియా గెలిచే అవకాశం ఉండేదని రమీజ్ రాజా తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆశలు వదలుకోవాలని, నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులలో ఆసీస్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ఆడటానికి ఇబ్బంది పడ్డారన్నారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ రాణిస్తున్నాడని, అక్షర్ పటేల్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడని, జట్టు సభ్యులు మొత్తం గెలవడానికి కృషి చేశారని రమీజ్ రాజా తెలియజేశారు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-0 అధిక్యంలో నిలిచింది.