టీమిండియా ఆటగాళ్లతో స్నేహం చేయడం చాలా కష్టం : రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మధ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. ఇటీవల విండీస్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఓడిపోయినప్పటికీ జట్టు సభ్యులకు అశ్విన్ తన మద్దతును తెలియజేశాడు. యువ ఆటగాళ్లు ఓటమి నుంచి పాఠాలను నేర్చుకోవాలని సూచించారు ఈ మధ్యే భారత ఆటగాళ్లు స్నేహితుల కంటే సహోద్యోగులని చెప్పి అందరిని అశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియా జట్టు సభ్యులతో స్నేహం చేయడం చాలా కష్టమని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొనడం విశేషం.
ఐపీఎల్లో ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ
టీమిండియా ఆటగాళ్లు వేర్వేరు జట్లకు ఆడుతున్నప్పుడు స్నేహితులగా ఉండడం చాల కష్టమని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ ఆడుతున్నప్పుడు మూడు నెలల పాటు సహచర ఆటగాళ్లు వేరే జట్ల కోసం ఆడతారని, అటువంటి సమయంలో వారి మధ్య స్నేహం ఉండదని, ఇరు జట్ల ఆటగాళ్లు గెలుపు కోసమే ప్రయత్నిస్తారని చెప్పుకొచ్చారు. ఈ రోజుల్లో వివిధ లీగ్ లు పుట్టుకుస్తున్నాయని , ఈ నేపథ్యంలో ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకుంటోందని వెల్లడించారు.