AB de Villiers: విరాట్‌ను ఆపడం అసాధ్యం.. రిథమ్‌లోకి వస్తే బౌలర్లకు చుక్కలే: ఏబీ డివిలియర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మరోసారి విజేతగా నిలిపేందుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అత్యంత కీలకమైన తుదిపోరులో కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన అతడు విన్నింగ్ రన్ కొట్టి ఆర్సీబీ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఆర్సీబీ మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డి విలియర్స్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు చేసిన వ్యూహాత్మక తప్పిదాన్ని కూడా విశ్లేషించాడు.
వివరాలు
ప్రశంసలు కురిపించిన డివిలియర్స్
"విరాట్ కోహ్లీకి లక్ష్యాన్ని ఎలా ఛేజ్ చేయాలో బాగా తెలుసు. అంతేకాదు, ఇన్నింగ్స్‌ను ఎలా ముగించాలో కూడా అతడికి అద్భుతమైన అవగాహన ఉంది. ఫైనల్‌లో చివరి వరకు క్రీజులో నిలిచి విన్నింగ్ రన్ కొట్టడం అతడి గొప్పతనానికి నిదర్శనం" అని డివిలియర్స్ పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ల బౌలింగ్ ప్రణాళికపై కూడా ఆయన స్పందించాడు. "బౌలర్లు కోహ్లీ ప్యాడ్ల వైపు ఎక్కువగా బంతులు సంధించారు. అలాంటి బంతులను విరాట్ తప్పకుండా బౌండరీలకు తరలిస్తాడు. ఒకసారి అతడు రిథమ్‌లోకి వచ్చాడంటే అతడిని ఆపడం చాలా కష్టమని విశ్లేషించాడు. అలాగే ఈ సీజన్‌లో కోహ్లీ ప్రదర్శన వెనుక ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కూడా డివిలియర్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
వివరాలు
ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం
"ఈ ఏడాది నేను విరాట్‌ను గమనించినప్పుడు అతడు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడం నిజంగా అద్భుతం. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించడం కష్టం" అని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీ కానున్నాడు. జూన్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో అతడు భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో కోహ్లీ బ్యాటింగ్‌ను మరోసారి చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.