LOADING...
WPL: మెరుపుల ఆటకు వేళాయె.. ముంబయి-బెంగళూరు మ్యాచుతో డబ్ల్యూపీఎల్‌ ప్రారంభం!

WPL: మెరుపుల ఆటకు వేళాయె.. ముంబయి-బెంగళూరు మ్యాచుతో డబ్ల్యూపీఎల్‌ ప్రారంభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అభిమానులారా సిద్ధమేనా! టీ20 ప్రపంచకప్‌, ఐపీఎల్‌కు ముందు మరోసారి క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ధనాధన్‌ టోర్నీ తెరలేపుతోంది. నేటి నుంచే మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ప్రారంభం కానుంది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, అష్లీ గార్డ్‌నర్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, అమేలియా కెర్‌, మెగ్‌ లానింగ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు తమ అద్భుత ఆటతో అభిమానులకు కావాల్సినంత వినోదం పంచేందుకు సిద్ధమయ్యారు. లీగ్‌ తొలి మ్యాచ్‌లో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్‌.. మాజీ విజేత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది.

Details

రసవత్తర పోరుకు సిద్ధం 

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ నాలుగో సీజన్‌ శుక్రవారం ఆరంభమవుతోంది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌.. స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఢీకొంటుంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌, వెస్టిండీస్‌ కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌లు జట్టులో ఉండటంతో ముంబయి మరింత దుర్భేద్యంగా కనిపిస్తోంది. వీరితో పాటు హర్మన్‌ప్రీత్‌, కమలిని, అమేలియా కెర్‌, అమన్‌జ్యోత్‌ రూపంలో ముంబయి బ్యాటింగ్‌ బలంగా ఉంది. ఫాస్ట్‌బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ ముంబయి బౌలింగ్‌కు నాయకత్వం వహించనుండగా, సైకా ఇషాక్‌ రూపంలో నాణ్యమైన స్పిన్నర్‌ కూడా ఉంది.

Details

బెంగళూరుకు సవాళ్లు

మరోవైపు దిగ్గజ ఆటగాళ్లు ఎలిస్‌ పెర్రీ లేకపోవడం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు పెద్ద లోటు. ఆమె గైర్హాజరీలో కెప్టెన్‌ స్మృతి మంధాన టాప్‌లో ఎలా ఆడుతుందన్నదే ఆ జట్టుకు కీలకం కానుంది. జార్జియా వోల్‌తో పాటు ఆల్‌రౌండర్లు గ్రేస్‌ హారిస్‌, నదైన్‌ డిక్లెర్క్‌ బ్యాటింగ్‌ భారం మోస్తారు. వికెట్‌కీపర్‌ రిచా ఘోష్‌ రూపంలో మంచి ఫినిషర్‌ ఆర్సీబీకి ఉంది. లారెన్‌, పూజ వస్త్రాకర్‌, అరుంధతి రెడ్డి, డిక్లెర్క్‌ పేస్‌ బాధ్యతలు వహిస్తారు. రాధ యాదవ్‌, శ్రేయాంక పాటిల్‌ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు కూడా బెంగళూరుకు ఉన్నారు. నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది.ఆరంభంలో పేసర్లకు కొంత సహకారం లభించవచ్చు. ఛేదనలో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది.

Advertisement

Details

అలరించనున్న ప్రారంభోత్సవం

ఇక్కడ ఇప్పటివరకు జరిగిన 11 డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌ల్లో కేవలం మూడుసార్లు మాత్రమే తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయం సాధించడం గమనార్హం. మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా, జియో సినిమా యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉంటుంది. డబ్ల్యూపీఎల్‌ తొలి మ్యాచ్‌కు ముందు నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ క్రికెట్‌ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ప్రఖ్యాత గాయకుడు యోయో హనీ సింగ్‌, బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. జాక్వెలిన్‌తో పాటు మాజీ మిస్‌ యూనివర్స్‌ హర్నాజ్‌ సంధు తమ నృత్యాలతో అభిమానులను అలరించనున్నారు.

Advertisement

Details

కొత్తగా ఆకర్షణగా…

ఈ సీజన్‌లో తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న లిజెలె లీ, దీయా యాదవ్‌, మిల్లీ ఇల్లింగ్‌వర్త్‌లు ప్రత్యేక ఆసక్తిని రేపుతున్నారు. వీరు తప్పక గమనించాల్సిన ప్లేయర్లు. దక్షిణాఫ్రికా మాజీ వికెట్‌కీపర్‌ లిజెలె లీ డబ్ల్యూబీబీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో మంచి ఫామ్‌లో ఉంది. ఆ టోర్నీలో ఆమె 38.12 సగటుతో 305 పరుగులు చేసింది. స్ట్రైక్‌రేట్‌ 154.82గా నమోదైంది. డబ్ల్యూపీఎల్‌లో ఆమె దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇంకా అరంగేట్రం చేయని హరియాణా బ్యాటర్‌ దీయా యాదవ్‌ కూడా దిల్లీ తరఫునే ఆడనుంది. కేవలం 16 ఏళ్ల వయసులోనే దీయా.. తన రాష్ట్రానికే చెందిన షెఫాలి వర్మ తరహాలో ధాటిగా ఆడే శైలి కలిగి ఉంది.

Details

తొలిసారి డబుల్‌ హెడర్‌లు

ముంబయి జట్టుకు ఆడనున్న మిల్లీ ఇల్లింగ్‌వర్త్‌ మంచి ఫాస్ట్‌బౌలర్‌. సుమారు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసే ఆమె ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్‌, రంజీ ట్రోఫీల కారణంగా అనేక వేదికలను బీసీసీఐ బుక్‌ చేయడంతో ఈసారి నవీ ముంబయి, వదోదర మాత్రమే డబ్ల్యూపీఎల్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలి 11 మ్యాచ్‌లు నవీ ముంబయిలో జరగనుండగా, ఎలిమినేటర్‌, ఫైనల్‌తో సహా మిగతా 11 మ్యాచ్‌లు వదోదరలో జరుగుతాయి. డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో తొలిసారి డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు ఉండడం విశేషం. ఈ నెల 10, 17 తేదీల్లో నవీ ముంబయిలో రెండేసి మ్యాచ్‌లు జరగనున్నాయి. డబుల్‌ హెడర్‌ రోజుల్లో తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది.

Details

ఇప్పటివరకు డబ్ల్యూపీఎల్‌ కథ

మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తయ్యాయి. ఈ టోర్నీలో ముంబయి ఇండియన్స్‌ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. 2023, 2025 సంవత్సరాల్లో ఆ జట్టు టైటిళ్లు గెలుచుకుంది. 2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజేతగా నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్‌ మాత్రం మూడు సీజన్లలోనూ ఫైనల్‌ చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈసారి కొత్త జట్టు టైటిల్‌ గెలుస్తుందా? లేక పూర్వ విజేతలే మళ్లీ ఆధిపత్యం చెలాయిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Details

ఇదే ఫార్మాట్

టోర్నీ ఎప్పటిలాగే డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో జరుగుతుంది. అయిదు జట్లు ఒకదానితో ఒకటి రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి. లీగ్‌ దశలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. టేబుల్‌ టాపర్‌ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ బెర్త్‌ కోసం ఎలిమినేటర్‌లో తలపడతాయి.

Details

వీళ్లు లేరు…

ఈ సీజన్‌లో కొందరు కీలక ఆటగాళ్లు డబ్ల్యూపీఎల్‌కు దూరమయ్యారు. ఆస్ట్రేలియా స్టార్‌ ఎలిస్‌ పెర్రీ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ నుంచి వైదొలిగింది. మూడు సీజన్లలో ఆర్సీబీ తరఫున ఆమె అద్భుత ప్రదర్శన చేసింది. 25 మ్యాచ్‌ల్లో 972 పరుగులు చేసి, 14 వికెట్లు పడగొట్టింది. ఆర్సీబీ టైటిల్‌ గెలిచిన ఏడాది ఆమె టాప్‌ స్కోరర్‌. ఈసారి పెర్రీతో పాటు స్మృతి మంధాన, రిచా ఘోష్‌, శ్రేయాంక పాటిల్‌లను ఆర్సీబీ కొనసాగించింది. పెర్రీ స్థానంలో పేసర్‌ సయాలీని జట్టులోకి తీసుకుంది. మరో ఆస్ట్రేలియా క్రీడాకారిణి అనాబెల్‌ సదర్లాండ్‌ కూడా వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమైంది.

Details

టోర్నీకి దూరమైన అనాబెల్‌ సదర్లాండ్‌ 

గత సీజన్‌లో దిల్లీ తరఫున ఆమె 9 వికెట్లు పడగొట్టి, 95 పరుగులు చేసింది. ఈసారి ఆమెను దిల్లీ అట్టిపెట్టుకున్నా, స్థానంలో ఆసీస్‌ లెగ్‌ స్పిన్నర్‌ అలానా కింగ్‌ను తీసుకుంది. ఇక 2026 క్వాలిఫయర్స్‌ కోసం అమెరికా జట్టుకు ఎంపిక కావడంతో తారా నోరిస్‌ యూపీ వారియర్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆమె స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ చార్లీ నాట్‌ను తీసుకున్నారు. అలీసా హీలీ, చమరి ఆటపట్టు, హెదర్‌ నైట్‌లను వేలంలో ఏ ఫ్రాంఛైజీ కూడా ఎంపిక చేయలేదు. జెస్‌ జొనాసెన్‌, తాలియా మెక్‌గ్రాత్‌, సోఫీ మోలినోక్స్‌లు అసలు వేలంలో తమ పేర్లే నమోదు చేయలేదు.

Advertisement