LOADING...
Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా? 
ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?

Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్‌పై పెద్దగా ఆశలు లేకపోయినా, ఇప్పుడు అదే జట్టు టైటిల్‌కు అతి దగ్గరగా ఉంది. గతంలో ఒక్కసారి కూడా కప్పు గెలవలేకపోయిన పంజాబ్, చివరిసారిగా 2014లో ఫైనల్‌ బరిలోకి దిగింది. అయితే, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. అప్పటి తర్వాత ఇప్పుడు, 2025లో 11 ఏళ్ల విరామం తర్వాత శ్రేయస్ అయ్యర్‌ నేతృత్వంలో మరోసారి పంజాబ్ ఫైనల్‌కు చేరింది. ట్రోఫీ కైవసం చేసేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచింది.

Details

గత సీజన్‌లోనే విజేతగా శ్రేయస్ 

గత సీజన్‌ అయిన 2024లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ గెలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. టైటిల్ ఫేవరెట్లుగా భావించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను, 8 వికెట్ల తేడాతో చిత్తుచేసి కోల్‌కతా ట్రోఫీని ఎగురేసింది. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను కేవలం 113 పరుగులకే కట్టడి చేయడం శ్రేయస్ వ్యూహాత్మక నేతృత్వానికి నిదర్శనం. ఛేజింగ్‌లో కేవలం 10.3 ఓవర్లలో కోల్‌కతా విజయాన్ని అందుకుంది.

Details

కోల్కతా రిటైన్ చేయలేదు 

అంతటి ఘనత సాధించినప్పటికీ 2025 మెగా వేలంలో కోల్‌కతా శ్రేయస్‌ను రిటైన్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ అవకాశాన్ని వదలకుండా, పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26.75 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. ఇది సీజన్‌లో అత్యంత ఖరీదైన కొనుగోళ్లలో ఒకటి.

Details

ముందు ఢిల్లీకి కూడా ఫైనల్‌కు నడిపించిన కెప్టెన్ 

ఇది శ్రేయస్‌కు మూడో ఫైనల్. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు నడిపించాడు. అయితే అప్పుడు ముంబయి ఇండియన్స్ చేతిలో ఢిల్లీ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 156 పరుగులు చేయగా, ముంబయి 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రెండోసారి ట్రోఫీ గెలిపించే కెప్టెన్‌గా మారుతారా? ఈసారి పంజాబ్ అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని శ్రేయస్ తీర్చాడు. మూడు వేరు వేరు జట్లను ఐపీఎల్ ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా అతడు అరుదైన ఘనత సాధించాడు. ఇక ఫైనల్‌లో ఆర్సీబీపై గెలిస్తే, వరుసగా రెండు సీజన్లలో రెండు వేరు వేరు జట్లకు టైటిల్ గెలిపించిన తొలి కెప్టెన్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు.

Details

ఆర్సీబీపై ఓటమి - పంజాబ్‌కు సవాలు 

క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓటమి పంజాబ్‌కు కొద్దిగా ఎదురుదెబ్బతీరే అంశం. అయినా, క్వాలిఫయర్ 2లో ముంబయి ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్‌ను బలపరిచింది. శ్రేయస్ మెరుపులు మెరిపిస్తూ జట్టును గెలుపుదిశగా నడిపిస్తున్నాడు.