LOADING...
Ashwin-Jadeja: జడేజా కోహ్లీని చూసి నేర్చుకోవాలి.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు
జడేజా కోహ్లీని చూసి నేర్చుకోవాలి.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

Ashwin-Jadeja: జడేజా కోహ్లీని చూసి నేర్చుకోవాలి.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డే ఫార్మాట్‌లో ఇటీవలి కాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో జడేజా ఒక్క వికెట్ కూడా సాధించలేకపోవడం గమనార్హం. ఈ ప్రదర్శనతో 50 ఓవర్ల ఫార్మాట్‌లో అతని కెరీర్ ముగింపు దశకు చేరిందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జడేజాపై అతని మాజీ సహచరుడు రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్‌లో కొత్త ప్రయోగాలు చేయాలని తాను ఎన్నోసార్లు జడేజాకు సూచించినట్లు అశ్విన్ వెల్లడించాడు. అయితే, జడేజాకు సర్దిచెప్పడం అంత సులభం కాదని, ఈ విషయంలో విరాట్ కోహ్లీని చూసి అతను నేర్చుకోవాలని పేర్కొన్నాడు

Details

ఒక స్నేహితుడిగా సలహాలు ఇస్తుంటా

జడేజాకు ప్రత్యేకమైన బలాలు ఉన్నాయని, వాటినే నమ్ముకుని బౌలింగ్ చేస్తాడని అశ్విన్ తెలిపాడు. "ఒక స్నేహితుడిగా నేను జడేజాకు ఎప్పటికప్పుడు చెబుతుంటాను. భిన్నంగా ప్రయత్నిస్తే ఏమవుతుంది? బిషన్ సింగ్ బేడీ, మణిందర్ సింగ్ లేదా మిచెల్ శాంట్నర్‌లా కొత్తగా బౌలింగ్ చేయమని కూడా సూచించాను. కొత్త విధానంలో విఫలమైతే జట్టు నుంచి తప్పిస్తారు. కానీ పాత పంథాలోనే మొండిగా కొనసాగుతూ విఫలమైనా కూడా టీమ్ నుంచి బయటకు పంపిస్తారు. అలాంటప్పుడు కొత్తగా ప్రయత్నించి విజయం సాధిస్తే పరిస్థితి మారుతుంది. ప్రతికూలంగా ఆలోచించకుండా సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని అశ్విన్ వివరించాడు. నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా జడేజా బౌలింగ్‌ను తాను గమనిస్తున్నానని అశ్విన్ చెప్పాడు.

Details

విరాట్ ను ఆదర్శంగా తీసుకోవాలి

నెట్స్‌లో ప్రాక్టీస్ సమయంలో జడేజా క్యారమ్ బాల్‌ను ప్రయోగిస్తాడని, కానీ మ్యాచ్‌ల్లో మాత్రం ఆ ఆయుధాన్ని ఉపయోగించడని వెల్లడించాడు. చాలా కాలంగా తనకు విజయాన్ని అందించిన బలాలపైనే జడేజా పూర్తిగా ఆధారపడుతున్నాడని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జడేజా తన వన్డే కెరీర్‌ను కాపాడుకోవాలంటే విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలని అశ్విన్ సూచించాడు. "కోహ్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతున్నాడు. అందుకే అతడు రాణిస్తున్నాడు" అని చెప్పాడు. ఫామ్ కోల్పోయిన దశ నుంచి కోహ్లీ తన ఆటలో మార్పులు చేసుకుని మళ్లీ అద్భుత ప్రదర్శన ఇస్తున్నాడని అశ్విన్ గుర్తుచేశాడు. వన్డేల్లో కోహ్లీ గత ఏడు ఇన్నింగ్స్‌లలో 124, 23, 93, 65*, 102, 135, 74 పరుగులు చేసి తన స్థిరత్వాన్ని చాటుకున్నాడు.

Advertisement