Jasprit Bumrah: ప్రపంచ క్రికెట్‌లో జస్ప్రిత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ : వసీం అక్రమ్
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా స్పీడ్ గన్ జస్పిత్ బుమ్రా మంచి జోరు మీద ఉన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను పడగొడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మ్యాచులో బుమ్రా బౌలింగ్ విధానం అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో బుమ్రా బౌలింగ్‌పై పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో బుమ్రానే అత్యుత్తమ బౌలర్ అంటూ కితాబిచ్చాడు. నియంత్రణతో కూడిన వేగం, వైవిధ్యం వల్లే అతను అద్భుతంగా రాణిస్తున్నాడని, ఔట్ స్వింగర్లను తన మాదిరే వేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. మొత్తంగా బుమ్రా తనకంటే బాగా బౌలింగ్ చేస్తున్నాడని వసీం అక్రమ్ వెల్లడించారు.
పాకిస్థాన్ పేసర్ల కంటే బుమ్రా మెరుగైనవాడు : వసీం అక్రమ్
ఇంగ్లండ్ బ్యాటర్లను బుమ్రా బోల్తా కొట్టించిన విధానం అద్భుతమని, మంచి వేగంతో బౌలింగ్ చేశాడని, పాకిస్థాన్ జట్టులో ఉన్న పేస్ బౌలర్ల కంటే అతను మెరుగైనవాడని వసీం అక్రమ్ చెప్పాడు. ఒకవేళ బుమ్రాను అడ్డుకోవాలంటే అతని షూలు దొంగతనం చేయడం తప్ప వేరే మార్గం లేదని సలహా ఇచ్చాడు. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో బుమ్రా 14 వికెట్లను పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా తర్వాతి మ్యాచులో నవంబర్ 2న శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచు కోసం ఇప్పటికే టీమిండియా ప్లేయర్లు ముంబాయికి చేరుకున్నారు.