12 ఏళ్లు నిరీక్షించి.. కలను సాకారం చేసుకున్నాడు
టీమిండియా బౌలర్ జయదేవ్ ఉనద్కత్ 12 ఏళ్ల తరువాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. తనపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ అందివచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు లెఫ్టార్మ్ పేసర్. ప్రస్తుతం భారత ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ట్విటర్ పోస్టును నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. జయదేవ్ ఆటగాళ్ల సంతకంతో కూడిన రెండు జెర్సీలను తన ట్విటర్‌ఖాతాలో పోస్ట్ చేశాడు. అందులో ఒకటి 2010లో వేసుకున్నది, రెండోది డిసెంబరు 2022లో ధరించింది. 2010 జెర్సీపై కెప్టెన్ ధోనీ, సెహ్వాగ్, సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ ఆటగాళ్ల సంతకాలు ఉన్నాయి. 2022 తాజా జెర్సీపై కేఎల్ రాహుల్ సారథ్యంలోని జట్టు సభ్యులు సంతకాలు చేస్తూ అభినందించారు.
'12 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది'
రెండో టెస్టు మ్యాచ్ కోసం ఉనద్కత్ 12 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. 2010లో టెస్టులోకి అరగేట్రం చేసిన ఉనద్కత్ ఆ సమయంలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే గాయం కారణంగా బుమ్రా టెస్టు సిరీస్‌కు దూరమవడంతో ఉనద్కత్ చోటు దక్కించుకున్నాడు. రెండో టెస్టులో వికెట్ తీసి తన కలను సాకారం చేసుకున్నాడు. దీనిపై ఉనద్కత్ స్పందిస్తూ.. ''మొదటి టెస్టు, రెండో టెస్టు మధ్య ఉన్న 12 ఏళ్ల గ్యాప్ ఏర్పడింది. మొదటి టెస్టులో ఒక్క విసకెట్ కూడా తీయలేకపోయాను. మళ్లీ భారత జట్టు తరఫున ఆడే అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా వికెట్ తీయాలని కోరుకున్నా, ఇప్పుడు నా కల సాకారమైంది' అని ఉనద్కత్ ఓ వీడియోను పోస్టు చేశాడు.