Joe Root: 23 వేల అంతర్జాతీయ పరుగులు.. సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్
ఈ వార్తాకథనం ఏంటి
జో రూట్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకుని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. 36 ఏళ్ల వయసుకు చేరువవుతున్నా రూట్ బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
వివరాలు
జో రూట్ అరుదైన ఘనత
శ్రీలంకతో డర్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో జో రూట్ 23 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఈ ఫీట్‌ను 521 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు. సచిన్ టెండూల్కర్ 522 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. రూట్ ఒక ఇన్నింగ్స్ ముందుగానే రికార్డును చేరుకున్నాడు.
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ కేవలం 490 ఇన్నింగ్స్‌ల్లోనే 23 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు.
ఆ తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా ఇప్పుడు జో రూట్ నిలిచాడు.
వివరాలు
ఎనిమిదో బ్యాటర్‌గా రూట్
అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగులు సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా జో రూట్ రికార్డు సృష్టించాడు.
అంతేకాదు.. ఈ అరుదైన మైలురాయిని అందుకున్న తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా కూడా నిలిచాడు.
రూట్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ ఈ ఘనతను సాధించారు.
వివరాలు
సచిన్ మరో రికార్డుపై కన్ను
టెస్టు క్రికెట్‌లోనూ జో రూట్ ఇప్పటికే సచిన్ టెండూల్కర్‌కు చెందిన పలు రికార్డులను అధిగమించాడు.
ఇటీవల టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు.
ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టి మరో కీలక రికార్డుపై పడింది.
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఉన్న సచిన్ రికార్డును కూడా రూట్ అధిగమిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. జో రూట్ ప్రస్తుతం 14,278 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇద్దరి మధ్య 1,643 పరుగుల వ్యత్యాసం ఉంది.
వివరాలు
36 ఏళ్ల వయసులోనూ పరుగుల వరద
ఈ ఏడాది డిసెంబర్‌లో జో రూట్ 36 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టనున్నాడు.
అయినప్పటికీ అతడి బ్యాటింగ్‌లో జోరు ఏమాత్రం తగ్గడం లేదు.టెస్టుల్లో సచిన్ 200 మ్యాచ్‌లు ఆడగా.. రూట్ ప్రస్తుతం ఆ రికార్డుకు 31టెస్టుల దూరంలో ఉన్నాడు.
టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన రూట్.. వన్డేల్లోనూ తనదైన ముద్ర వేశాడు.
ఆసక్తికరంగా ప్రస్తుతం అతడి టెస్టు బ్యాటింగ్ సగటు కంటే వన్డేల్లో బ్యాటింగ్ సగటే మెరుగ్గా ఉంది.
శ్రీలంకతో తొలి వన్డేకు ముందు రూట్ 7,826 వన్డే పరుగులు సాధించాడు.
51కిపైగా బ్యాటింగ్ సగటుతో పాటు 20 శతకాలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ ఇప్పటికే రికార్డు నెలకొల్పాడు.