రంజీ ట్రోఫీలో దుమ్ములేపుతున్న కేదార్ జాదవ్
మహారాష్ట్ర ఆటగాడు కేదార్ జాదవ్ రంజీ ట్రోఫీలో అబ్బురపరిచే ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. కొద్ది రోజుల కిందట అస్సాంతో జరిగిన మ్యాచ్ లో 283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు చేసి విరుచుకుపడిన విషయం తెలిసిందే ముంబైతో ప్రారంభమైన కీలకమైన మ్యాచ్‌లో సెంచరీతో మళ్లీ కదం తొక్కాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో జాదవ్ రెండో సెంచరీ నమోదు చేయడం గమనార్హం.
రంజీలో జాదవ్ అద్భుత ప్రదర్శన
2019-20 సీజన్ తర్వాత ఫస్ట్-క్లాస్ క్రికెట్లో జాదవ్ పునరాగమనం చేశాడు. అస్సాంతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 283 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు జాదవ్ 110.6 సగటుతో 553 పరుగులు చేశాడు. ఎలైట్ గ్రూప్-బిలో పోటీపడుతున్న మహారాష్ట్ర, ముంబై జట్లు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో చెరో 3 విజయాలు సాధించాయి. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ముంబై జట్టు భీకర ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఈ మ్యాచ్‌లో ఆడలేదు.