Kevin Pietersen: 'ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనం'.. కెవిన్ పీటర్సన్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. టైటిల్ కోసం అన్ని జట్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. అభిమానులు కూడా మ్యాచ్‌లను ఆస్వాదిస్తూ మజా పొందుతున్నారు. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ అకాలంగా ముగిసిన దానికి ఐపీఎల్ కూడా ఒక కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో పాల్గొనే విషయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో ఏర్పడిన విభేదాలే తన కెరీర్‌పై ప్రభావం చూపాయని ఆయన ఆరోపించాడు. ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్సన్ మాట్లాడుతూ, ఐపీఎల్ ప్రారంభ దశలో ఈసీబీ తనపై ఒక రకంగా 'విచారణ' చేసినట్లు తెలిపారు. అలాగే మీడియాను వినియోగించి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించిందని తెలిపాడు.
వివరాలు
'అందుకే కెరీర్ కోల్పోయా'
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లకు ఈసీబీ అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలో కేవలం డిమిత్రి మస్కరేనస్ మాత్రమే టోర్నీలో పాల్గొనగలిగాడు. 2009లో మూడు వారాల సమయానికి మాత్రమే అనుమతి ఇచ్చినా, తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాధాన్యత ఇవ్వడం బోర్డుకు నచ్చలేదని పీటర్సన్ వెల్లడించాడు. "నేను చాలా త్యాగాలు చేశాను.. చివరికి నా కెరీర్‌ను కోల్పోయాను. అదే కారణంగా వ్యవస్థలోని పలువురు నా వ్యతిరేకంగా మారారు. 33 ఏళ్ల వయసులోనే నా ఇంగ్లండ్ కెరీర్ ముగిసిపోయింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
వివరాలు
33 ఏళ్ల కెరీర్ ఇలా అయిపోయింది..
తాను 104 టెస్టులు ఆడి 33 ఏళ్లకే కెరీర్ ముగించాల్సి వచ్చిందని, వాస్తవానికి 150 నుంచి 160 టెస్టులు ఆడి 12,000 నుంచి 13,000 పరుగులు చేయగలిగేవాడినని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. "నా మీద దాడి చేయడానికి ఈసీబీ 'ది టెలిగ్రాఫ్' పత్రికను ఉపయోగించింది. ఆ విషయాన్ని మరింతగా వివరించాలనుకోవడం లేదు. ఆ వార్తలు విస్తృతంగా ప్రచారం పొందాయి. అయినా పర్వాలేదు.. ప్రస్తుతం నేను సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నాడు. పీటర్సన్ కెరీర్ విషయానికి వస్తే, టెస్ట్ క్రికెట్‌లో ఆయన 23 సెంచరీలు, 35 అర్ధశతకాలతో కలిపి మొత్తం 8,181 పరుగులు నమోదు చేశాడు.