BCCI Emergency Meeting: రెండో వన్డేకు ముందు కీలక చర్చలు.. గంభీర్, అగార్కర్‌తో బీసీసీఐ స్పెషల్ మీటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో బుధవారం (డిసెంబర్ 3) జరగనున్న రెండో వన్డేకు ముందు టీమిండియా భవిష్యత్ ప్రణాళికలపై కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభతేజ్ సింగ్ భాటియా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పాల్గొననున్నారని సమాచారం. అయితే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ఈ మీటింగ్‌కు హాజరవుతారో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ఈ సమావేశంలో కొన్ని అత్యవసర అంశాలను పరిశీలించాలని బీసీసీఐ భావిస్తోంది. ముఖ్యంగా ఇటీవల మ్యాచ్‌ల్లో అద్భుతమైన బ్యాటింగ్‌తో మరోసారి ఫామ్‌లోకి వచ్చిన భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు ప్రణాళికలపై చర్చ జరిగే అవకాశముంది.
Details
రాబోయే టోర్నీలకు బలమైన వ్యూహం సిద్ధం చేయడమే లక్ష్యం
అలాగే జట్టు ఎంపికలో స్థిరత్వాన్ని కొనసాగించడం, దీర్ఘకాలికంగా టీమిండియా ప్రదర్శనను మెరుగుపరచే విధానంపై కూడా కమిటీ దృష్టి సారించనుంది. ఇందుకు సంబంధించి ఒక సీనియర్ బీసీసీఐ అధికారి కూడా ఇదే విషయాన్ని సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమి సమయంలో బయటపడిన లోపాలపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చ జరగనుంది. జట్టులో ఉన్న బలహీనతలను తొందరగా పరిష్కరించి, రాబోయే టోర్నీలకు బలమైన వ్యూహం సిద్ధం చేయడం బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
Details
భవిష్యత్తులో ఎలా ఆడాలనే దానిపై నిర్ణయం
గంభీర్-అగార్కర్ ఇద్దరూ పాల్గొనడం వల్ల, భవిష్యత్తులో టీమిండియా ఎలా ఆడాలి, ఏ దిశగా ముందుకు సాగాలి అనే విషయాల్లో స్పష్టమైన ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఏడాది టీ20 ప్రపంచ కప్‌ను గెలిపే లక్ష్యంతో భారత్ ముందుకు సాగాలనే సూచనలు ఈ సమావేశంలో వెలువడే అవకాశం ఉంది. అదే దిశగా వన్డే ప్రపంచ కప్‌కు కూడా టీమిండియాను బలమైన పోటీదారుగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుత సమస్యలను తొందరగా పరిష్కరించాలని బీసీసీఐ దృష్టి పెట్టినట్లు సమాచారం.