LSG vs KKR:సూపర్ ఓవర్‌లో లక్నోపై కేకేఆర్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఏకనా స్టేడియంలో జరిగిన లక్నో సూపర్‌జెయింట్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను పంచింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు సమాన పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈ సీజన్‌లో నమోదైన తొలి సూపర్ ఓవర్ ఇదే కాగా, ఇందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో తమ స్థితిని మరింత మెరుగుపరుచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ (83 పరుగులు) తోడవడంతో జట్టు 155 పరుగులు చేసింది.
వివరాలు
సూపర్ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన లక్నో
అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా చివరి బంతికి మహమ్మద్ షమీ సిక్స్ కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులకే పరిమితమైంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర ఒత్తిడికి లోనై కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో కోల్‌కతా ముందు నామమాత్ర లక్ష్యం నిలిచింది. కేవలం రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి బంతికే రింకూ సింగ్ ఫోర్ కొట్టి విజయాన్ని ఖాయం చేశారు.
వివరాలు
ఐదు వికెట్లతో చెలరేగిన మోహ్సిన్ ఖాన్
ఈ మ్యాచ్‌లో మొహిసిన్ ఖాన్ ఐదు వికెట్ల అద్భుత ప్రదర్శనతో కేకేఆర్ ఓటమి ఖాయమనే పరిస్థితి కనిపించినా, రింకూ సింగ్ పోరాటం, బౌలర్ల సమష్టి కృషి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాయి. ఏకనా స్టేడియంలో జరిగిన ఈ సూపర్ ఓవర్ పోరు అభిమానులకు అసలైన ఐపీఎల్ మజాను అందించింది.