IND vs AUS: కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీలు.. భారీ అధిక్యంలో భారత జట్టు
2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటి రోజు భారత్ 150 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. అయితే భారత బౌలర్లు ఆసీస్ బ్యాటర్లు కట్టడి చేయడంతో ఆసీస్ 104 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో 5 వికెట్లు పడగొట్టగా, టెస్ట్ అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. సిరాజ్ కూడా 2 వికెట్లు తీశాడు. ఆసీస్ బ్యాట్స్‌మన్‌లలో మిచెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
218 పరుగుల ఆధిక్యంలో భారత్
దాంతో భారత్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, ఆసీస్ బౌలర్లను కట్టడి చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (62 నాటౌట్), యశస్వి జైస్వాల్ (90 నాటౌట్) క్రీజులో నిలిచారు. ఇద్దరు కలిసి 172 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించారు. జైస్వాల్ అప్టస్ స్టేడియంలో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు సాధించాడు. ఈ రికార్డు తొలుత ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. మూడో రోజు ఆటలో టీమిండియా 218 పరుగుల ఆధిక్యంతో మరింత ముందుకు సాగనుంది.