LOADING...
KL Rahul : రాహుల్‌ శతకంతో కర్ణాటక అద్భుత విజయం
రాహుల్‌ శతకంతో కర్ణాటక అద్భుత విజయం

KL Rahul : రాహుల్‌ శతకంతో కర్ణాటక అద్భుత విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
07:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్ తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో అతను ఆడిన అపూర్వ శతకం కర్ణాటకకు చారిత్రక విజయాన్ని అందించింది. భారీ లక్ష్య ఛేదనలో చూపిన సమయస్పూర్తి, సహనం ఈ ఇన్నింగ్స్‌ను అత్యుత్తమ చేజ్‌లలో ఒకటిగా నిలిపాయి. 325 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటకకు రాహుల్‌ కీలక స్థంభంగా నిలిచాడు. మ్యాచ్‌ చివరి వరకు క్రీజ్‌ను వదలకుండా నిలిచి, 182 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 130 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఈ క్రమంలో స్మరణ్‌ రవిచంద్రన్‌తో కలిసి నెలకొల్పిన 147 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను పూర్తిగా కర్ణాటక వైపుకు తిప్పింది.

వివరాలు 

4 వికెట్ల తేడాతో కర్ణాటక ఘన విజయం

స్మరణ్‌ రవిచంద్రన్‌ అజేయంగా 83 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేయగా, విద్యాధర్‌ పాటిల్‌ 31 పరుగులతో అతనికి అండగా నిలిచాడు. కర్ణాటక 73.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి,4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫలితంతో కర్ణాటక సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుని, ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే తొలి సెమీఫైనల్లో ఉత్తరాఖండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ముందుగా బ్యాటింగ్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 120 పరుగులకే ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లు కావేరప్ప, ప్రసిద్ద్‌ కృష్ణ,శ్రేయస్‌ గోపాల్‌ తలో మూడు వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్‌కు దెబ్బేశారు. ముంబై తరఫున అఖిల్‌ హెర్వాద్కర్‌ చేసిన 60 పరుగులే టాప్‌ స్కోర్‌గా నిలిచాయి.

వివరాలు 

కర్ణాటక బౌలర్లలో శిఖర్‌ షెట్టి మూడు వికెట్లు

అనంతరం కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది. మయాంక్‌ అగర్వాల్‌ 92 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ముంబై బౌలర్లలో మోహిత్‌ అవస్తి,తుషార్‌ దేశ్‌పాండే తలో నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టారు. ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులు చేసి ఆలౌటైంది. ఆకాశ్‌ ఆనంద్‌ 70 పరుగులతో అర్ధశతకం సాధించగా,తనుశ్‌ కోటియన్‌ (48 నాటౌట్‌),తుషార్‌ దేశ్‌పాండే (47),ముషీర్‌ ఖాన్‌ (49),యశస్వి జైస్వాల్‌ (36), అఖిల్‌ హెర్వాద్కర్‌ (33), సిద్దేశ్‌ లాడ్‌ (25), సూర్యాంశ్‌ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు అందించారు. కర్ణాటక బౌలర్లలో శిఖర్‌ షెట్టి మూడు వికెట్లు తీసుకోగా, విద్యాధర్‌ పాటిల్‌, కావేరప్ప తలో రెండు, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ సాధించారు.

Advertisement