వన్డేల్లో 65 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఓటమిపాలైంది. ముంబై విజయంతో ఆరంభించిన రోహిత్ సేన గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సిరీస్ కూడా చేజారిపోయింది. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్నర్లు అడమ్ జంపా, అష్టన్ అగర్ ధాటికి టీమిండియా బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో వన్డేల్లో 65 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొదట కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. తర్వాత పాండ్యాతో కలిసి 34 పరుగులు జోడించాడు.
స్వదేశంలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ
స్వదేశంలో కోహ్లీ వన్డేల్లో 5,406 పరుగులు చేసి ఆస్ట్రేలియా లెజెండ్ రికి పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ 6,976 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో అత్యధిక హాఫ్ సెంచరీలు జాక్వెస్ కలిస్(46) రికార్డును కోహ్లీ (47) అధిగమించాడు. ఈ జాబితాలో కూడా టెండూల్కర్ 58 హాఫ్ సెంచరీలు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లి ఆస్ట్రేలియాతో జరిగిన 46 వన్డేల్లో 2,172 పరుగులు చేశాడు. టెండూల్కర్ (3,077), డెస్మండ్ హేన్స్ (2,262), రోహిత్ శర్మ (2,251) పరుగులు చేసిన అతని కంటే ముందు ఉన్నారు. ఆస్ట్రేలియాపై కోహ్లి 8 వన్డే సెంచరీలు చేయగా.. సచిన్ టెండూల్కర్ (9) సెంచరీలు చేశారు.