KKR vs MI: పాండే బాధ్యతాయుత ఇన్నింగ్స్.. కోల్‌కతా ఖాతాలో మరో గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా నైట్‌రైడర్స్ మరోసారి సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బుధవారం జరిగిన పోరులో ముంబయి ఇండియన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి, కోల్‌కతా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు తడబడింది. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేసింది. కార్బిన్ బోష్ చివర్లో వేగంగా ఆడి 18 బంతుల్లో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో గ్రీన్, సౌరభ్ దూబె, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్ అద్భుత నియంత్రణతో ముంబయిని కట్టడి చేశాడు. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫిన్ అలెన్ త్వరగా ఔటయ్యాడు.
వివరాలు
బాధ్యతాయుతంగా ఆడిన మనీష్ పాండే, రోమన్ పావెల్
అయినప్పటికీ రహానే, మనీష్ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆరంభంలో పరుగులు నెమ్మదిగా వచ్చినా రహానే దూకుడు పెంచి బుమ్రా బౌలింగ్‌లో వరుస ఫోర్లు సాధించాడు. అయితే కార్బిన్ బోష్ వరుస ఓవర్లలో రహానే, గ్రీన్‌లను ఔట్ చేసి కోల్‌కతాను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ సమయంలో మనీష్ పాండే, రోమన్ పావెల్ బాధ్యతాయుతంగా ఆడారు. ఇద్దరూ వికెట్లు కాపాడుకుంటూనే అవకాశమొచ్చినప్పుడల్లా బౌండరీలు బాదారు. పరుగుల వేగం తగ్గకుండా జట్టును లక్ష్యం వైపు నడిపించారు. హార్దిక్ బౌలింగ్‌లో పాండే వరుస ఫోర్లు కొట్టగా.. రఘు శర్మ ఓవర్లో మరో బౌండరీతో కోల్‌కతా స్కోరు వంద దాటింది. పావెల్ కూడా చురుకైన ఆటతో ముంబయిపై ఒత్తిడి పెంచాడు.
వివరాలు
ఆరంభం నుంచే కష్టాల్లో ముంబయి
అయితే విజయానికి దగ్గరపడుతున్న సమయంలో పాండే, పావెల్ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది. 16వ ఓవర్లో కోల్‌కతా 124 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. చివర్లో రింకు సింగ్, తేజస్వి దహియా జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. ఒత్తిడిలో తేజస్వి ఔటైనా.. అనుకుల్‌తో కలిసి రింకు జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోల్‌కతా 18.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇక ముంబయి ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించింది. గ్రీన్ మూడో ఓవర్లో రికెల్టన్‌ను ఔట్ చేయగా.. అదే ఓవర్లో నమన్ ధీర్ కూడా వెనుదిరిగాడు.
వివరాలు
ముంబయికి ఊపిరి పోసిన కార్బిన్ బోష్
అనంతరం సౌరభ్ దూబె చెలరేగి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ముంబయి 41పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా పరుగులు రావడం కష్టమైంది. ఏడో ఓవర్ నుంచి పదకొండో ఓవర్ వరకు కేవలం 22పరుగులే వచ్చాయి. ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. నరైన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబయి బ్యాటర్లను పూర్తిగా నియంత్రించాడు. తిలక్ ఒక భారీ షాట్ ఆడినప్పటికీ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. హార్దిక్ కూడా 26 పరుగుల వద్ద వెనుదిరిగాడు. చివర్లో జాక్స్ ఒక సిక్సర్ బాదినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 18 ఓవర్లకు 115 పరుగులతోనే నిలిచిన ముంబయికి కార్బిన్ బోష్ ఊపిరి పోశాడు.
వివరాలు
16 డాట్‌బంతులు వేసి ముంబయి బ్యాటర్లపై ఒత్తిడి పెంచిన నరైన్
చివరి రెండు ఓవర్లలో అతడు దూకుడుగా ఆడి జట్టుకు కీలక పరుగులు అందించాడు. 19వ ఓవర్లో దీపక్ చాహర్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించిన బోష్.. చివరి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మెరిపించాడు. దీంతో ముంబయి గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయగలిగింది. మ్యాచ్ మధ్యలో వర్షం కారణంగా దాదాపు గంటసేపు ఆట నిలిచిపోయింది. అయినప్పటికీ కోల్‌కతా ఆటగాళ్లు ఏకాగ్రత కోల్పోకుండా అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా నరైన్ ఒక వికెట్ మాత్రమే తీసినా 16 డాట్‌బంతులు వేసి ముంబయి బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు.