IPL-Cricket League : ఐపీఎల్ లో కోల్ కతా జట్టు మళ్లీ విజయాల బాట పట్టేనా?
ఈ ఏడాది ఐపీఎల్ (IPL-Cricket) క్రికెట్ టోర్నీలో వరుసగా మూడు విజయాలు సొంతం చేసుకుని మంచి దూకుడుగా కనిపించిన కోల్ కతా క్రికెట్ జట్టుకు ఏమైందో తెలియదు గానీ గత మ్యాచ్ లో పరాజయాన్ని చవిచూసింది. తాజాగా ఆదివారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా కోల్ కతా జట్టు లఖ్ నవూ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో నైనా కోల్ కతా జట్టు దూకుడు ప్రదర్శించి మ్యాచ్ ను గెలుచుకుంటుందేమో వేచి చూడాలి. బ్యాటింగ్ పరంగా కోల్ కతా (Kolkata) జట్టుకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా లఖ్ నవూ (Lakhnavu) పటిష్ట బౌలింగ్ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
ఓపెనర్లు శుభారంభం అందిస్తే బౌలర్లకు చుక్కలే..
ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ లు బ్యాటింగ్ కు దిగి ఊచకోత మొదలు పెడుతుంటే ఏ జట్టు బౌలింగ్ విభాగమైనా బెంబేలెత్తి పోతున్నారు. ఆదివారం నాటి మ్యాచ్ లో కూడా ఈ ఓపెనర్లు ఇద్దరూ శుభారంభం అందిస్తే యువ బ్యాట్స్ మన్లు రఘువంశి, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించేందుకు వీలు చిక్కుతుంది. స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ తేలిపోతున్నా హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, రస్సెల్ లు మంచి కట్టుదిట్టంగా బంతులు విసిరి వికెట్లు సాధిస్తున్నారు. మిచెల్ స్టార్క్ కూడా ఫామ్ లోకి వచ్చేస్తే కోల్ కతా జట్టుకు ఈ మ్యాచ్ లో విజయం నల్లేరు మీద నడకేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైదొలిగిన బౌలర్ మయాంక్ యాదవ్
లఖ్ నవూ జట్టులో నిలకడైనే ప్రదర్శన చేస్తున్న కేఎ ల్ రాహుల్ పైనే ఆ జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. పూరన్, స్టైనిస్, క్వింటన్ డికాక్ లు నామ మాత్రపు ప్రదర్శనకే పరిమితమైపోతున్నారు. ఈ మ్యాచ్ లోనైనా వీరు అద్భుతంగా ప్రదర్శన చేస్తే మాత్రం కోల్ కతా జట్టుకు కష్టాలు తప్పవు. స్టార్ బౌలర్ మయాంక్ యాదవ్ వైదొలగడం లఖ్ నవూ జట్టుకు అతి పెద్ద లోటే. ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని వదులుకోదు. ఎందుకంటే మ్యాచ్ జరిగేకొద్దీ బాగా టర్న్ అయ్యే పిచ్ గా ఈడెన్ గార్డెన్స్ మైదానంకు పేరుంది మరి. చూడాలి ఏ జట్టు గెలుస్తుందో?