డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు డ్యూక్ బదులుగా కూకబుర్ర బంతి.. ఈ రెండు బాల్స్ కు తేడా ఏంటీ?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ టోర్నీ ముగిసిన వెంటనే ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంగ్లాండ్కు వెళ్లనున్నారు. జూన్ 7 నుంచి 11 వరకూ ఈ టోర్నీ జరగనుంది. లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ టోర్నీ కోసం ఐసీసీ పలు కీలక మార్పులను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో వాడుతున్న డ్యూక్ బంతికి బదులుగా కూకబుర్ర బంతిని ఉపయోగించాలని ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. గతేడాది న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ డ్యూక్ బంతిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఐసీసీ సమావేశంలో ఆస్ట్రేలియా దిగ్గజం రికిపాంటింగ్ కూకబుర్రబంతి గురించి క్లుప్తంగా వివరించారు.
కూకబుర్ర బంతితో ఫాస్ట్ బౌలర్లు రాణించే అవకాశం
కూకబుర్ర ఒక ఆస్ట్రేలియన్ స్పోర్టింగ్ గూడ్స్ కంపెనీ.. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ తో సహా చాలా జట్లు టెస్టు క్రికెట్ లో కూకబుర్ర బంతినే ఉపయోగిస్తున్నాయి. కూకబుర్ర బాల్ కన్నా ఎస్‌జి బాల్ ను కుట్టడానికి ఉపయోగించే దారం మందంగా ఉండి, కుట్ల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. కూకబుర్ర బాల్ సీమ్ వైపు పట్టు బాగా ఉండటంతో బౌలర్లకు సురక్షితంగా పట్టుకోవడానికి వీలు ఉంటుంది. ఆ బంతి మెరుపును కోల్పోయిన తర్వాత ఎక్కువగా బౌన్స్ అవ్వగలదు. దీంతో ఫాస్ట్ బౌలర్లు బ్యాట్స్ మెన్ లను కట్టడి చేసే అవకాశం ఉంది.