Kumar sangakkara: ఆ రెండు నిమిషాలు నా జీవితాన్ని మార్చేశాయి: సంగక్కర
ఈ వార్తాకథనం ఏంటి
సంవత్సరాలు గడిచిపోయినా కూడా, ఆ భయానక ఘటన జ్ఞాపకాలు ఇంకా ఆటగాళ్ల మనసులను వెంటాడుతూనే ఉన్నాయి. 2009లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన ఉగ్రదాడి క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో శ్రీలంక ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆ ఘటన తర్వాత కొన్నేళ్ల పాటు పాకిస్థాన్‌లో ఆడటానికి అనేక జట్లు ఆసక్తి చూపలేదు. దాంతో పాకిస్థాన్ జట్టు తటస్థ వేదికలపై మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దాడిలో కుమార సంగక్కరతో పాటు అజంత మెండిస్, తిరంగ, సురంగ, తిలాన్ సమరవీర, తుషారా వంటి ఆటగాళ్లు గాయపడ్డారు.
వివరాలు
క్షణాల్లోనే బాంబు దాడి..
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంగక్కర ఆ ఘటనను మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఇప్పటికీ తన శరీరంలో ఆ దాడికి సంబంధించిన బాంబు శకలాలు ఉన్నాయని ఆయన వెల్లడించాడు. "2009 మార్చి 3న పాకిస్థాన్-శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్ మూడో రోజు జరుగుతోంది. హోటల్ నుంచి స్టేడియంకు బయలుదేరేందుకు మేమంతా సిద్ధమయ్యాం. అప్పుడు మా జట్టులోని ఒక ఫాస్ట్ బౌలర్ 'ఈ ఫ్లాట్ పిచ్ వల్ల మా వెన్నుముకలు నొప్పిగా ఉన్నాయి. ఎక్కడైనా బాంబు పేలితే మ్యాచ్ రద్దవుతుందేమో, అప్పుడు ఇంటికి వెళ్లిపోవచ్చు' అని సరదాగా అన్నాడు. ఆ మాట ముగిసిన క్షణాల్లోనే మాపై నిజంగానే దాడి జరిగింది.
వివరాలు
సైనికుల జీవితం అప్పుడు అర్థమైంది…
"ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత నేను కొలంబోలో కారు నడుపుకుంటూ వెళ్తుంటే ఒక ఆర్మీ అధికారి నన్ను ఆపి 'మీరు ఎలా ఉన్నారు?' అని అడిగారు. నేను బాగున్నానని చెప్పాను. 'ఆ ఘటన గురించి మేము వార్తల్లో చూశాం, చాలా షాక్‌కు గురయ్యాం' అని ఆయన అన్నారు. దానికి నేను 'మీలాంటి సైనికులు ఇలాంటి సంఘటనలను తరచూ ఎదుర్కొంటారని మేము చూస్తుంటాం' అని చెప్పాను. వెంటనే ఆయన 'అందుకే మేము స్వచ్ఛందంగా సైన్యంలో చేరుతాం' అని సమాధానమిచ్చారు. మేము క్రికెట్ ఆడితే మంచి జీతం వస్తుంది. కానీ సైనికులు దాదాపు 25 ఏళ్ల పాటు ఎదుర్కొంటున్న పరిస్థితిని మేము కేవలం రెండు నిమిషాలపాటు అనుభవించగానే హీరోలమయ్యాం" అని సంగక్కర వివరించాడు.