LOADING...
IPL 2026: అయ్యో..ఏమైంది వీళ్లకు..ఐపీఎల్‌లో వెనకబడటానికి కారణాలేంటి?
అయ్యో..ఏమైంది వీళ్లకు..ఐపీఎల్‌లో వెనకబడటానికి కారణాలేంటి?

IPL 2026: అయ్యో..ఏమైంది వీళ్లకు..ఐపీఎల్‌లో వెనకబడటానికి కారణాలేంటి?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 06, 2026
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత ఐపీఎల్‌లో ఫైనల్స్‌ చేరిన జట్లు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఇప్పటివరకు రెండేసి విజయాలు నమోదు చేశాయి. ఢిల్లీ జట్టును తప్ప మిగతా మూడు జట్లలో ఓపెనింగ్‌ జోడీలలో కనీసం ఒకరు బాధ్యతగా ఆడుతూ మంచి ఇన్నింగ్స్‌లు ఆడినట్లు కనిపించింది. అయితే ఢిల్లీ విషయానికి వస్తే, వారి మిడిల్ ఆర్డర్‌ ఆటగాళ్లు జట్టును విజయపథంలో నడిపించారు. ఇతర జట్లు సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డేంజరస్ ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సారి ఏదీ కలిసి రాకపోవడం గమనార్హం. చెన్నై పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. భారీ అంచనాలు అందుకోవడంలో ఆటగాళ్లు విఫలమవుతున్నారు.

వివరాలు 

అప్పట్లో వాళ్లంటే బౌలర్లకు భయం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు వినగానే ప్రత్యర్థి జట్లలో భయం నెలకొనేది. ఈసారి తమపై ఎంత భారీ స్కోరు చేస్తారోనని బౌలర్లు ఆందోళన చెందేవారు. గత సీజన్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌ల దూకుడు అద్భుతంగా ఉండేది. ఈ ఎడిషన్‌లో 300 పరుగుల మైలురాయిని చేరగల సామర్థ్యం ఉన్న జట్టు సన్‌రైజర్స్ మాత్రమే అని అభిమానులు భావించారు. కానీ ఈసారి ఆ అంచనాలు పూర్తిగా తప్పు అని ఓపెనింగ్ జోడీ నిరూపించింది. మూడు మ్యాచ్‌లలో కోల్‌కతాపై తప్ప మిగతా రెండింటిలో పూర్తిగా విఫలమైంది. బెంగళూరు, హైదరాబాద్ పిచ్‌లు సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా, మొదటినుంచే దూకుడుగా ఆడితే విజయవంతం కావడం కష్టమవుతోంది.

వివరాలు 

ఓటములు తప్పించుకుంటారా?

ప్రస్తుతం బౌలర్లు నెమ్మదిగా బంతులు వేస్తూ వికెట్లు తీస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓపికతో ఆడటం చాలా ముఖ్యం. నితీశ్, క్లాసెన్ వంటి ఆటగాళ్లు గత రెండు మ్యాచ్‌లలో అది చేసి చూపించారు. కానీ అభిషేక్, హెడ్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆడటం విమర్శలకు దారితీసింది. మూడు మ్యాచ్‌లలో అభిషేక్ కేవలం 55 పరుగులు, ట్రావిస్ హెడ్ 64 పరుగులు మాత్రమే చేశారు. అందులోనూ ఒక్కసారి 40కు పైగా స్కోరు చేయడం వల్లే ఆ సంఖ్యలు వచ్చాయి. సన్‌రైజర్స్ బౌలింగ్ ఇతర జట్లతో పోలిస్తే బలహీనంగానే ఉంది. అందువల్ల బ్యాట్స్‌మెన్ రాణిస్తేనే బౌలర్లు కొంత ఒత్తిడి లేకుండా ఆడగలుగుతారు. లేకపోతే ఓటములను తప్పించుకోవడం కష్టమే.

Advertisement

వివరాలు

ఓపెనింగ్ జోడీ విఫలమైందిలా..

ఇప్పటి పరిస్థితిని చూస్తుంటే గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ జోడీ మెరుగ్గా ఉందనిపిస్తోంది. డేవన్ కాన్వేతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అయితే ఈసారి భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ మాత్రం కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోతున్నాడు. రుతురాజ్-సంజు జోడీ ఇప్పటివరకు చేసిన అత్యధిక భాగస్వామ్యం కేవలం 14 పరుగులే. భారీ లక్ష్యాలను ఛేదించే సందర్భాల్లోనూ బాధ్యతగా ఆరంభం ఇవ్వాలనే ప్రయత్నం కనిపించలేదని అభిమానులు విమర్శిస్తున్నారు.

Advertisement

వివరాలు

సంజూ పరిస్థితేంటి?

రూ.18 కోట్ల భారీ ధరతో తన ఇష్టమైన జట్టులో చేరిన సంజు నుంచి ఇప్పటివరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా రాలేదు. గత టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన అతనిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సీఎస్‌కే ఆరో టైటిల్ సాధిస్తుందనే నమ్మకం వ్యక్తమైంది. ధోని లేకపోయినా జట్టును ముందుకు నడిపిస్తాడని అనుకున్నారు. కానీ బ్యాట్స్‌మన్‌గా కనీసం రెండు అంకెల స్కోరు కూడా చేయలేకపోవడం నిరాశ కలిగించింది. మెగా లీగ్‌కు ముందు రుతురాజ్ స్థానంలో సంజును కెప్టెన్‌గా నియమించాలనే చర్చలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం అతని ప్రదర్శనను చూసి తుది జట్టులో అవసరమా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement