Page Loader
రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్..?
వీవీఎస్ లక్ష్మణ్

రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2023
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్ స్థానంలో ఆ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే కొన్ని సిరీస్ లకు టీమిండియా తాత్కాలిక కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించాడు. భవిష్యత్తులో పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు. ద్రవిడ్ కు పదవీ కాలంలో పొడిగించకపోయినా, కోచ్ గా తప్పుకోవాలని భావించినా వీవీఎస్ లక్ష్మణ్ తోనే ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ అధినేతగా ఉన్న లక్ష్మణ్ తో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోందట.

వీవీఎస్ లక్ష్మణ్

సీనియర్ జట్టుకు విజయాలు అందించడంలో విఫలం

జూనియర్ జట్టు కోచ్‌గా ద్రవిడ్ అద్భుత విజయాలను అందించాడు. అయితే సీనియర్ జట్టుకు విజయాలను అందించడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా ఐసీసీ మేజర్ టోర్నీలలో భారత్ బొక్కబోర్లా పడింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ స్థానాన్ని లక్ష్మణ్‌తో భర్తీ చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారట. లక్ష్మణ్‌కు కోచింగ్ బాధ్యతలు కొత్తేమీ కాదు. రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో భారత జట్టుకు ఇన్‌చార్జ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. జనవరి 1న బీసీసీఐ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మను పిలకపోవడం గమనార్హం. 2023 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్‌కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో చర్చించారు.