విరాట్ కోహ్లీ తర్వాతే అతని బ్యాటింగ్ అంటేనే ఇష్టం : పాక్ మాజీ బౌలర్
క్రికెట్ మైదానంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచుకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఉంటుంది. ఇరు జట్లు అటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లుగా మైదానంలో పోటీపడుతుంటారు. హై ఓల్టోజ్ నడుమ సాగే ఈ మ్యాచును చూడటానికి ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అప్పుడప్పుడు పాక్ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తుతారు. తాజాగా పాక్ మాజీ పేసర్ అమీర్అహ్మద్, టీమిండియా మాజీకెప్టెన్ విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. అమీర్ టాప్ త్రీ ఫేవరెట్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌ను పేర్లను ప్రస్తావించాడు. అయితే మూడో ప్లేయర్ కోసం శుభ్‌మాన్‌గిల్‌ను అతను ఎంపిక చేసుకున్నాడు. కోహ్లీ, బాబర్ టీ20లే కాకుండా టెస్టులు, వన్డేల్లోనూ తన ఫేవరేట్ బ్యాటర్లు అని అమీర్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నారు.
శుభ్‌మన్ గిల్ భవిష్యత్తులో టీమిండియాకు నాయకత్వం వహిస్తాడు
శుభ్ మాన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, భవిష్యత్తులో టీమిండియాకు నాయకత్వం వహించే లక్షణాలు పుష్కలంగా అతనిలో ఉన్నాయని అమీర్ పేర్కొన్నారు. బౌలర్ల విషయానికొస్తే, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, నసీమ్ షా, మిచెల్ స్టార్క్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. గతంలోనూ టీమిండియా బ్యాటర్లను అమీర్ ప్రశంసలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. మహ్మద్ అమీర్ పాకిస్థాన్ తరుపున 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. టీమ్ మేనేజ్‌మెంట్‌తో వాగ్వాదం తర్వాత 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో 3 వికెట్లతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.