చిరునవ్వుతో పీఎస్జీకి వీడ్కోలు పలికిన లియోనల్ మెస్సీ
స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పీఎస్జీ తో ఉన్న బంధానికి ముగింపు పలికాడు. కొంతకాలంగా క్లబ్ యాజమాన్యంతో విబేధాలు, అక్కడి అభిమానుల నుంచి విమర్శలు రావడంతో పీఎస్జీ తరుపున చివరి మ్యాచ్ ను ఆడేశాడు. ఈ మ్యాచులో క్లెర్మాంట్ క్లబ్ చేతిలో పీఎస్జీ 2-3గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. అతనితో పాటు సెర్గియో రామోస్ కూడా పీఎస్‌జీ నుంచి తప్పుకున్నాడు. మైదానంలో వ్యాఖ్యాత మెస్సీ పేరును ప్రకటించినప్పుడు స్టాండ్‌లోని అభిమానులు అతన్ని ఆ గౌరపరిచేలా గట్టిగా అరిచారు. వీటిని పట్టించుకోని మెస్సీ చిరునవ్వుతోనే మైదానంలోకి దిగాడు. ఈ మ్యాచులో గోల్ కొట్టేందుకు మెస్సీ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మ్యాచ్ ముగిశాక అతను సహచర ఆటగాళ్లతో అప్యాయతగా మాట్లాడాడు.
పీఎస్జీ తరుపున 32 గోల్స్ చేసిన మెస్సీ
తనకు రెండేళ్ల పాటు ఆడే అవకాశం కల్పించిన పీఎస్జీ క్లబ్ కు, పారిస్ కు ధన్యవాదాలని, భవిష్యతులో ఈ క్లబ్ మరెన్నో విజయాలు సాధించాలని మెస్సీ పేర్కొన్నారు. అయితే ఇంకో ఏడాది ఈ క్లబ్ లో కొనసాగుతాడని భావించినా, తమ అనుమతి లేకుండా సౌదీ అరేబియాకు వెళ్లాడని మెస్సీని క్లబ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పీఎస్జీ తరుపున అతను 32 గోల్స్ చేయడంతో పాటు 35 గోల్స్ లో సాయపడ్డాడు. అదే విధంగా జట్టుకు రెండు ఫ్రెంచ్ లీగ్ టైటిళ్లు, ఓ ఫ్రెంచ్ ఛాంపియన్ ట్రోఫీని అందించాడు. మెస్సీ సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ క్లబ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది.