Saurabh Ganguly: టీమిండియాను ఫైనల్లో ఆపడం కష్టమే.. ప్రశంసలు కురిపించిన గంగూలీ
వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. నవంబర్ 19న ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ పోటీపడనున్నాయి. ఈ క్రమంలో భారత జట్టుపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ తర్వాత గంగూలీ మీడియాతో మాట్లాడారు. టోర్నీ లీగ్ దశ, సెమీ ఫైనల్లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని, ఇదే విధంగా ముందుకెళితే టీమిండియాను ఆపడం కష్టమేనని గంగూలీ పేర్కొన్నాడు.
భారత జట్టు ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది
ప్రస్తుతం భారత జట్టు ఫుల్ జోష్ లో ఉందని, ఫైనల్ చేరడం చాలా ఆనందంగా ఉందని గంగూలీ చెప్పాడు. కప్పు సాధించడానికి భారత్ కేవలం ఒక్క అడుగు దూరంలో ఉందని, ఆస్ట్రేలియాకు కూడా మంచి జట్టేనని, ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని గంగూలీ అన్నాడు. 20 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడడం ఇది రెండోసారి. 2003లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిపాలైంది. అప్పుడు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది.