IPL 2023: గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 30వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నో లోని ఆటల్ బిహార్ వాజ్ పేయి స్టేడియంలో జరగనుంది. లక్నో గుజరాత్ పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైన గుజరాత్.. తిరిగి విజయంతో పుంజుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. గత సీజన్లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడగా.. ఈ రెండిట్లోనూ గుజరాత్ విజయం సాధించింది. ఆటల్ బిహార్ వాజ్ పేయి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంది. ఈ మైదానంలో 33 టీ20 జరగ్గా..17 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. 16 సార్లు ఛేజింగ్ జట్లు గెలిచాయి.
అరుదైన రికార్డుకు చేరువలో కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ టీ20ల్లో 7వేల పరుగుల పూర్తి చేయడానికి కేవలం 14 పరుగులు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 209 మ్యాచ్ లు ఆడి 42.33 సగటుతో 6,986 పరుగులు చేశాడు. ఇందులో 60 అర్ధసెంచరీలు, ఆరు సెంచరీలు చేశాడు. అదే విధంగా 300 సిక్సర్లు పూర్తి చేయడానికి అతను తొమ్మిది సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను ఆరు మ్యాచ్‌ల్లో 194 పరుగులు చేశాడు. అల్జారీ జోసెఫ్ టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టడానికి కేవలం ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం 82 టీ20ల్లో 24.28 సగటుతో 99 వికెట్లు పడగొట్టాడు. మర్కస్ స్టోయినిస్ కేవలం రెండు వికెట్లను సాధిస్తే టీ20ల్లో వంద వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవనున్నాడు.