Loading...
VVS Laxman: బీసీసీఐలో భారీ మార్పులు.. డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌?
బీసీసీఐలో భారీ మార్పులు.. డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌?

VVS Laxman: బీసీసీఐలో భారీ మార్పులు.. డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (సీవోఈ) అధిపతిగా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక పదోన్నతి కల్పించేందుకు బోర్డు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయనను 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్' అనే కొత్త, శక్తిమంతమైన హోదాలో నియమించే అంశంపై బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం లక్ష్మణ్ సీవోఈకి అధిపతిగా ఆటగాళ్ల శిక్షణ, పునరావాసం తదితర బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

వివరాలు

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవీకాలం సెప్టెంబరుతో ముగియనుంది

గతంలో ఇదే సంస్థను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)గా పిలిచేవారు. అయితే 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా బాధ్యతలు స్వీకరిస్తే ఆయన పరిధి మరింత విస్తరించనుంది.

సీనియర్ పురుషుల, మహిళల జట్లకు సంబంధించిన వ్యూహరచనలో భాగస్వామ్యం కావడంతో పాటు జాతీయ సెలక్షన్ కమిటీతో సమన్వయం చేయడం, జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకు ఆటగాళ్ల అభివృద్ధిని పర్యవేక్షించడం వంటి కీలక అధికారాలు లక్ష్మణ్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం కూడా సెప్టెంబరుతో ముగియనుంది.

ఆయన పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించాలా? లేక కొత్త చీఫ్ సెలక్టర్‌ను నియమించాలా? అనే అంశంపై బోర్డు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

కీలక బాధ్యతలు దక్కే అవకాశం

గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కొత్త కోచింగ్ బృందంతో సమర్థవంతమైన సమన్వయం కోసం లక్ష్మణ్ వంటి అనుభవజ్ఞుడైన వ్యక్తి అవసరమని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని గతంలో బీసీసీఐ లక్ష్మణ్‌ను కోరింది.

అయితే ఆయన ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీవోఈ ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం సీవోఈ ప్రాజెక్టు గాడిలో పడటంతో.. లక్ష్మణ్ సుదీర్ఘ అనుభవాన్ని మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే జరిగితే బీసీసీఐ పాలనా వ్యవస్థలో 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు దక్కనున్నాయి.

ADVERTISEMENT