IND vs SA: కోహ్లి, రుతురాజ్ శతకాలు వృథా.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం
ఈ వార్తాకథనం ఏంటి
తొలి వన్డేలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. రెండో వన్డేలో విజయం సాధించింది. రాయ్‌పుర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది. విరాట్ కోహ్లీ (102; 93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతకం బాదడం... రుతురాజ్ గైక్వాడ్ (105; 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ సాధించడం, కెప్టెన్ కేఎల్ రాహుల్ (66 నాటౌట్; 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టడంతో భారత్ తొలుత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.
వివరాలు
49.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించిన దక్షిణాఫ్రికా
అనంతరం లక్ష్య ఛేదనలో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన మార్‌క్రమ్ (110; 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత శతకంతో జట్టును ముందుండి నడిపించాడు. అతడికి డెవాల్డ్ బ్రెవిస్ (54; 34 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు),మాథ్యూ బ్రీజ్కే (68; 64 బంతుల్లో 5 ఫోర్లు) కీలక అర్ధ శతకాలతో అండగా నిలిచారు. చివర్లో కార్బిన్ బోష్ (29 నాటౌట్; 15 బంతుల్లో 4 ఫోర్లు) వేగవంతమైన ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర వహించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. అర్ష్‌దీప్ (2/54)తప్ప భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. సిరీస్‌ను నిర్ణయించే మూడో వన్డే శనివారం వైజాగ్‌లో జరగనుంది.
వివరాలు
మార్‌క్రమ్ విధ్వంసం
తొలి వన్డేలో కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టు... ఈసారి మాత్రం భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్ మార్‌క్రమ్ గట్టి పునాది వేసి ఛేదనను సులభం చేశాడు. డికాక్ (8) త్వరగానే ఔటైనప్పటికీ, మార్‌క్రమ్ మాత్రం భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా రాణించాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 53 పరుగుల వద్ద మార్‌క్రమ్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద యశస్వి జైస్వాల్ జారవిడవడంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ బలహీనంగా ఉండగా... ఫీల్డర్ల తప్పిదాల వల్ల 30కి పైగా అదనపు పరుగులు వచ్చాయి.
వివరాలు
మార్‌క్రమ్ విధ్వంసం
కెప్టెన్ బవుమా (46; 48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) మార్‌క్రమ్‌తో కలసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో 20 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 118/1కి చేరుకుంది. రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం అనంతరం బవుమా ఔటైనా... సఫారీ జట్టుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. గత మ్యాచ్‌లో అర్ధశతకం చేసిన బ్రీజ్కే మరోసారి నిలకడగా బ్యాటింగ్ చేసి మార్‌క్రమ్‌కు అండగా నిలిచాడు. 88 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన మార్‌క్రమ్ హర్షిత్ రాణా వేసిన 30వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. అప్పటికే స్కోరు 197/3. ఈ సమయంలో భారత్‌కు వరుసగా వికెట్లు దక్కితే మ్యాచ్‌లో పట్టు సాధించే అవకాశం ఉండేది.
వివరాలు
మార్‌క్రమ్ విధ్వంసం
కానీ బ్రీజ్కే, బ్రెవిస్ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఒకవైపు బ్రీజ్కే నిలకడగా ఆడుతుంటే... క్రీజులో నిలదొక్కుకున్నాక బ్రెవిస్ తనదైన శైలిలో సిక్సర్లతో రెచ్చిపోయాడు. 10కిపైగా ఉన్న రన్‌రేట్‌ను తగ్గించే బాధ్యతను అతడే తీసుకున్నాడు. ఐదు బంతుల్లో మూడు సిక్సర్లు బాదడంతో లక్ష్యం సాధన చాలా సులభమయ్యింది. కుల్‌దీప్ బ్రెవిస్‌ను ఔట్ చేసినా... ఆ తర్వాత బ్రీజ్కే, యాన్సెన్ (2) త్వరగా వెనుదిరిగినా, జోర్జి (17) గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లినా భారత్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. తొలి వన్డేలో జట్టును గెలిపించడానికి విఫలయత్నం చేసిన కార్బిన్ బోష్.. ఈసారి దక్షిణాఫ్రికాను గెలిపించే మైదానాన్ని వీడాడు.
వివరాలు
కోహ్లి జోరు.. రుతురాజ్ దూకుడు:
ఇంతకుముందు రాయ్‌పుర్‌లో జరిగిన ఏకైక వన్డేలో న్యూజిలాండ్ 108 పరుగులకే కుప్పకూలింది. ఈసారి కూడా పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని భావించినా... వికెట్ బ్యాటర్లకు పూర్తిగా అనుకూలించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లను త్వరగానే కోల్పోయినా... కోహ్లి, రుతురాజ్, రాహుల్‌ల మెరుపు ఇన్నింగ్స్‌లతో భారీ స్కోరు సాధించింది. రోహిత్ (14) చకచకా బౌండరీలు కొట్టినా... ఐదో ఓవర్లో బర్గర్ చేతిలో ఔటయ్యాడు. కొద్ది సేపటికే యశస్వి (22; 38 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్)ను యాన్సెన్ పెవిలియన్‌కు పంపాడు. 10 ఓవర్లలోపే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ స్కోరు మాత్రం 60 దాటింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను కోహ్లి, రుతురాజ్ నడిపించారు.
వివరాలు
కోహ్లి జోరు.. రుతురాజ్ దూకుడు:
గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కోహ్లి ఆ ఊపును కొనసాగించగా... గత వన్డేలో విఫలమైన రుతురాజ్ ఈసారి పూర్తి నిబద్ధతతో బ్యాటింగ్ చేశాడు. ఎంగిడి బౌలింగ్‌లో పుల్ షాట్ సిక్సర్‌తో కోహ్లి తన ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత ఆచితూచి షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టాడు. స్ట్రైక్ రొటేషన్ చక్కగా చేస్తూ ఇద్దరూ బోర్డును పరుగులు పెట్టించారు. వికెట్ల మధ్య పరుగులు తీసే వేగంలో 37ఏళ్ల కోహ్లి యువ ఆటగాడైన రుతురాజ్‌ను మించిపోయాడు. కోహ్లి తన శతకంలో 45 సింగిల్స్ సాధించడం విశేషం.
వివరాలు
కోహ్లి జోరు.. రుతురాజ్ దూకుడు:
స్ట్రెయిట్ బ్యాట్‌తో డ్రైవ్‌లు, అవసరమైనప్పుడు లాఫ్టెడ్ షాట్లు ఆడి ఆకట్టుకున్నాడు. మరోవైపు రుతురాజ్ వికెట్ నలుమూలలా షాట్లు బాదాడు. యాన్సెన్ బౌలింగ్‌లో అతను కొట్టిన ఫైన్‌లెగ్ సిక్సర్ మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది. రుతురాజ్ 52 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, ఆ తర్వాత దూకుడుగా ఆడుతూ మరో 25 బంతుల్లో శతకాన్ని చేరుకున్నాడు. అనంతరం ఔటవడంతో మూడో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి 47 బంతుల్లో అర్ధశతకం, 90 బంతుల్లో సెంచరీ సాధించిన తర్వాత వెనుదిరిగాడు. చివర్లో కెప్టెన్ రాహుల్ గత మ్యాచ్‌లానే వేగంగా ఆడి అర్ధశతకం పూర్తిచేయగా... జడేజా (24 నాటౌట్) సహకారంతో భారత్ స్కోరు 350 దాటింది.