Page Loader
Matthew Wade Retirement: భారత్‌తో సిరీస్ ముందు.. మాథ్యూ వేడ్‌ కీలక నిర్ణయం
భారత్‌తో సిరీస్ ముందు.. మాథ్యూ వేడ్‌ కీలక నిర్ణయం

Matthew Wade Retirement: భారత్‌తో సిరీస్ ముందు.. మాథ్యూ వేడ్‌ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2024
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ క్రికెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2011లో ఆస్ట్రేలియా తరఫున తన క్రికెట్‌ ప్రయాణాన్ని ప్రారంభించిన 36 ఏళ్ల వేడ్, 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై చివరి మ్యాచ్ ఆడాడు. 2021 తర్వాత వన్డేలు, టెస్టుల్లో ఆడే అవకాశం రాకపోయినా, వేడ్‌ ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ 2021 విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ప్రత్యేకంగా, పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మూడు సిక్సర్లు కొట్టి ఆస్ట్రేలియాను ఫైనల్‌కు చేర్చాడు. మాథ్యూ వేడ్‌ 13 ఏళ్ల కెరీర్‌లో 36 టెస్ట్‌లు,97 వన్డేలు,92 టీ20లు ఆడాడు,ఇందులో 4700కి పైగా పరుగులు సాధించాడు.

వివరాలు 

రిటైర్మెంట్‌ తర్వాత ఆస్ట్రేలియా కోచింగ్‌ బృందంలో..

ఇందులో 5 సెంచరీలు, 19 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అతడు 13 టీ20 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. బ్రాడ్ హాడిన్ వ్యక్తిగత కారణాల వల్ల వైదొలగడంతో వేడ్‌ జట్టులో స్థానం సంపాదించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వేడ్‌ దేశవాళీ క్రికెట్, బిగ్‌బాష్‌ లీగ్‌లో మాత్రం కొనసాగుతాడు. రిటైర్మెంట్‌ తర్వాత ఆస్ట్రేలియా కోచింగ్‌ బృందంలో ఆండ్రీ బోరోవెక్‌ నేతృత్వంలో చేరనున్నాడు. పాకిస్తాన్‌తో నవంబర్‌ 4 నుంచి జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో వేడ్‌ కొత్తగా కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. తన భవిష్యత్ లక్ష్యం ప్రధాన కోచ్‌గా మారడం అని వేడ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక జట్టులో వికెట్‌ కీపర్‌గా జోష్ ఇంగ్లిస్‌ కీలక భూమిక పోషించనున్నాడు.