Cricket News: క్రికెట్ నిబంధనల్లో 73 మార్పులు: ఎంసీసీ సంచలన నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆధునిక క్రికెట్ అవసరాలకు తగ్గట్టు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రతిష్టాత్మక మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రికెట్ నిబంధనల్లో మొత్తం 73 మార్పులను ప్రతిపాదించింది.కాలానుగుణంగా ఆటలో ఉత్కంఠ పెంచడం,నిబంధనల్లో స్పష్టతతో పాటు పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ఎంసీసీ వెల్లడించింది. సవరించిన ఈ నిబంధనలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నియమావళి ప్రకారం సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌ల్లో చివరి ఓవర్లో వికెట్ పడితే ఆ రోజుకు ఆటను ముగించే పాత సంప్రదాయాన్ని ఎంసీసీ రద్దు చేసింది. ఇకపై వికెట్ పడినా మిగిలిన బంతులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
వివరాలు
బంతుల పరిమాణాల విషయంలోనూ ఎంసీసీ కొత్త నిర్వచనం
చివరి క్షణాల్లో వికెట్ పడినప్పుడు కొత్త బ్యాటర్ మైదానంలోకి రాకపోవడంతో మ్యాచ్ ఉత్కంఠ తగ్గిపోతున్నందున ఈ మార్పు తీసుకొచ్చినట్లు ఎంసీసీ వివరించింది. మహిళలు, జూనియర్ క్రికెట్‌కు సంబంధించిన బంతుల పరిమాణాల విషయంలోనూ ఎంసీసీ కొత్త నిర్వచనం ఇచ్చింది. బంతులను సైజ్ 1, సైజ్ 2, సైజ్ 3గా వర్గీకరించింది. పురుషుల క్రికెట్‌లో ఉపయోగించే సైజ్ 1 బంతిలో ఎలాంటి మార్పులు లేకపోయినా, మిగతా విభాగాల్లో నాణ్యత పెంచేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా బ్యాట్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ చెక్క ముక్కలను అతికించి తయారు చేసే 'ల్యామినేటెడ్ బ్యాట్ల' వాడకానికి అనుమతి ఇచ్చింది.
వివరాలు
వికెట్ కీపర్ పై జరిమానా
దీని వల్ల క్రికెటర్లపై ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో మాత్రం సింగిల్ విల్లో బ్యాట్లే కొనసాగనున్న అవకాశముంది. బౌలర్ రనప్ ప్రారంభించిన సమయంలో వికెట్ కీపర్ గ్లోవ్స్ స్టంప్స్ ముందుకు వచ్చినా ఇకపై జరిమానా విధించబోమని ఎంసీసీ స్పష్టం చేసింది. అయితే బౌలర్ బంతిని విడిచిన తర్వాత మాత్రం కీపర్ పూర్తిగా స్టంప్స్ వెనుకనే ఉండాలనే నిబంధనను కొనసాగిస్తోంది. '
వివరాలు
ఓవర్ త్రో పై ఎంసీసీ స్పష్టమైన నిర్వచనం
ఓవర్ త్రో' అనే పదానికి ఎంసీసీ తొలిసారిగా స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. అలాగే బ్యాటర్లు 'షార్ట్ రన్' తీసిన సందర్భాల్లో లేదా ఫీల్డర్ అడ్డుపడినప్పుడు, తదుపరి బంతికి ఎవరు స్ట్రైక్‌లో ఉండాలన్న నిర్ణయాన్ని ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌కే అప్పగించింది. బంతి ఫీల్డర్ చేతిలోకి వచ్చినా లేదా మైదానంలో కదలకుండా నిలిచిపోయినా దానిని 'సెటిల్డ్' అయినట్లుగా పరిగణిస్తామని ఎంసీసీ తెలిపింది. దీనికోసం తప్పనిసరిగా బౌలర్ లేదా వికెట్ కీపర్ చేతిలోనే బంతి ఉండాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.