LOADING...
T20 World Cup Row : మీడియా ప్రకటనలే గానీ ఐసీసీకి లేఖ లేదు.. బంగ్లా వైఖరిపై అనుమానాలు
మీడియా ప్రకటనలే గానీ ఐసీసీకి లేఖ లేదు.. బంగ్లా వైఖరిపై అనుమానాలు

T20 World Cup Row : మీడియా ప్రకటనలే గానీ ఐసీసీకి లేఖ లేదు.. బంగ్లా వైఖరిపై అనుమానాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీని కోరింది. అయితే ఈ విజ్ఞప్తిని బుధవారం ఐసీసీ స్పష్టంగా తిరస్కరించింది. మెగాటోర్నీకి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని, భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని ఐసీసీ పేర్కొంది. టోర్నీలో పాల్గొంటుందా లేదా అన్న విషయంపై నిర్ణయం తెలియజేయాలని బీసీబీకి 24 గంటల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువు ముగిసినప్పటికీ బీసీబీ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదని క్రిక్‌బజ్ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌లో ఆడబోమని బీసీబీ మీడియా సమావేశంలో మరోసారి స్పష్టం చేసింది.

Details

ఆటగాళ్ల భద్రతపై నమ్మకం కలగడం లేదు

బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు తమ ఆటగాళ్లు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. కానీ భారత్‌లో తమ జట్టు భద్రతకు ముప్పు ఉందని, ఆటగాళ్లు, విలేకరులు, అభిమానుల భద్రతపై నమ్మకం కలగడం లేదని వ్యాఖ్యానించారు. ఐసీసీ రూపొందించిన ముప్పు అంచనా నివేదిక ఆమోదయోగ్యంగా లేదని అన్నారు. అయినప్పటికీ తాము ఆశలు వదులుకోలేదని స్పష్టం చేశారు. టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు తమ జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆసిఫ్ నజ్రుల్.. భద్రత సమస్యను వాస్తవికంగా పరిగణలోకి తీసుకుని శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహించేలా ఐసీసీ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Details

స్కాట్లాండ్‌కు అవకాశం దక్కే అవకాశం

ఇక ఐసీసీ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బంగ్లా తప్పుకుంటే, ర్యాంకింగ్స్‌ ఆధారంగా స్కాట్లాండ్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఈ అంశంపై ఐసీసీ అతి త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.

Advertisement