T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్టార్ బౌలర్లు వీరే..!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్‌ల్లో భారత బౌలర్లు ఎప్పుడూ తమదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు నిర్వహించిన తొమ్మిది టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అనేకమంది భారత బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన టాప్-5 బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. భారత మాజీ స్పిన్నర్ అయిన అశ్విన్, టీ20 వరల్డ్‌కప్‌ల్లో మొత్తం 24 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 4 వికెట్లు - 11 పరుగులు.
వివరాలు
అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
రెండో స్థానంలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా మారిన అర్ష్‌దీప్, కేవలం 14 మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. గత టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన అతని బెస్ట్ ఫిగర్స్ 4/9. రాబోయే వరల్డ్‌కప్‌లోనూ అతనిపై భారీ ఆశలున్నాయి. మూడో స్థానంలో భారత పేస్ విభాగానికి ఆధారం అయిన జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. ఇప్పటివరకు 18 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీసిన బుమ్రా, అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ స్థాయి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 3/7గా ఉంది.
వివరాలు
హార్దిక్ పాండ్యా,రవీంద్ర జడేజా
నాలుగో స్థానంలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కీలకంగా మారిన హార్దిక్, టీ20 వరల్డ్‌కప్‌ల్లో 24 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు సాధించాడు. ఈ ఏడాది జరిగే టోర్నీలో అతను మరింత మెరుగ్గా రాణిస్తే ఈ జాబితాలో పైకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఐదో స్థానంలో మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్‌ల్లో 30 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసిన జడేజా, భారత్ వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 3/15.