FIFA : తొలి మ్యాచ్‌లోనే మూడు రెడ్ కార్డులు.. చర్చనీయాంశమైన రిఫరీ నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా వరల్డ్ కప్ ఘనంగా ఆరంభమైంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో సహ ఆతిథ్య జట్టు మెక్సికో విజయంతో శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో మెక్సికో 2-0 తేడాతో గెలుపొందింది. అయితే మ్యాచ్ ఫలితానికి మించి రిఫరీ విల్టన్ సాంపియో తీసుకున్న నిర్ణయాలే ఎక్కువగా చర్చకు దారితీశాయి. ఈ మ్యాచ్‌లో విల్టన్ సాంపియో ఏకంగా మూడు రెడ్ కార్డులు చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పరాజయానికి ఆయన నిర్ణయాలే కారణమయ్యాయని పలువురు అభిమానులు అభిప్రాయపడ్డారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు వ్యంగ్యంగా "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు రిఫరీకే ఇవ్వాలని వ్యాఖ్యానించారు. నెటిజన్లు మీమ్స్ రూపంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వివరాలు
అరుదైన రికార్డుగా నిలిచిన ఘటన..
2022లో జరిగిన గత ప్రపంచ కప్ టోర్నీ మొత్తం కలిపి కేవలం నాలుగు రెడ్ కార్డులు మాత్రమే నమోదయ్యాయి. కానీ ప్రస్తుత టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లోనే మూడు రెడ్ కార్డులు ఇవ్వడం విశేషంగా మారింది. అంతేకాకుండా, ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇంతమంది ఆటగాళ్లకు ముందస్తు హెచ్చరికలు లేకుండానే రెడ్ కార్డులు చూపించిన సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. టోర్నీ ఆరంభంలోనే ఇలాంటి రికార్డు నమోదవడంతో, రాబోయే మ్యాచ్‌ల్లో కూడా కఠిన నిర్ణయాలు పెరిగే అవకాశాలపై చర్చ సాగుతోంది.
వివరాలు
రెడ్ కార్డు ఎందుకు ఇస్తారు? దాని ప్రభావం ఏమిటి?
ఫుట్ బాల్ నిబంధనలను ఉల్లంఘించిన లేదా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఆటగాడికి రిఫరీ రెడ్ కార్డు జారీ చేస్తాడు. సాధారణంగా ఒక ఆటగాడు రెండు ఎల్లో కార్డులు పొందితే, అది రెడ్ కార్డుగా మారుతుంది. కొన్ని తీవ్రమైన తప్పిదాల సందర్భంలో మాత్రం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే నేరుగా రెడ్ కార్డు ఇవ్వవచ్చు. రెడ్ కార్డు అందుకున్న ఆటగాడు వెంటనే మైదానాన్ని వీడి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మ్యాచ్ ముగిసే వరకు అతడు తిరిగి ఆడే అవకాశం ఉండదు. అతని స్థానంలో మరో ఆటగాడిని దింపడం కూడా సాధ్యం కాదు.
వివరాలు
తదుపరి మ్యాచ్‌కు నిషేధం విధించే అవకాశం..
దీంతో ఆ జట్టు మిగతా మ్యాచ్‌ను తక్కువ మంది ఆటగాళ్లతోనే కొనసాగించాల్సి వస్తుంది. అదనంగా, రెడ్ కార్డు తీవ్రతను బట్టి సంబంధిత ఆటగాడిపై తదుపరి మ్యాచ్‌కు నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది. అయితే తుది నిర్ణయం టోర్నీ అధికారుల పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. మెక్సికో-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు ఒక్కసారి కూడా ఎల్లో కార్డు ఇవ్వకుండా నేరుగా రెడ్ కార్డులు చూపించడమే ప్రస్తుతం ప్రధాన విమర్శలకు కారణమైంది.