LOADING...
FIFA World Cup: నాకౌట్‌కు తొలి జట్టుగా మెక్సికో..బోస్నియాపై స్విట్జర్లాండ్ ఘన విజయం
నాకౌట్‌కు తొలి జట్టుగా మెక్సికో..బోస్నియాపై స్విట్జర్లాండ్ ఘన విజయం

FIFA World Cup: నాకౌట్‌కు తొలి జట్టుగా మెక్సికో..బోస్నియాపై స్విట్జర్లాండ్ ఘన విజయం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 20, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

2026 ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన మెక్సికో, నాకౌట్‌ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. సొంత ప్రేక్షకుల మద్దతుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో దక్షిణ కొరియాను 1-0తో ఓడించింది. ఈ విజయానికి లూయిస్‌ రోమో ఏకైక గోల్‌తో కీలక పాత్ర పోషించగా, కొరియా గోల్‌కీపర్‌ కిమ్‌ స్యూంగ్‌ గ్యు చేసిన తప్పిదం ఆ జట్టుకు చేటు చేసింది.

వివరాలు

రోమో గోల్‌తో విజయం..

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం గోల్‌ లేకుండానే ముగిసింది. ఇరు జట్లు అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ స్కోరు నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగాన్ని దూకుడుగా ప్రారంభించిన మెక్సికో, 50వ నిమిషంలో ఆధిక్యంలోకి వెళ్లింది. బాక్స్‌లోకి వచ్చిన బంతిని అందుకోవడానికి ప్రయత్నించిన గోల్‌కీపర్‌ కిమ్‌ స్యూంగ్‌ గ్యు తన జట్టు డిఫెండర్‌తో ఢీకొని బంతిని చేజార్చాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న లూయిస్‌ రోమో బంతిని సులభంగా గోల్‌లోకి పంపించాడు.

వివరాలు

అద్భుతంగా ఆడిన గోల్ కీపర్ రౌల్ రాంజెల్..

ఆ తర్వాత సమం చేసేందుకు దక్షిణ కొరియా తీవ్రంగా ప్రయత్నించింది. ముఖ్యంగా 87వ నిమిషంలో చో గ్యు సంగ్‌ కొట్టిన హెడర్‌ను మెక్సికో గోల్‌కీపర్‌ రౌల్‌ రాంజెల్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. వెంటనే యాంగ్‌ హ్యున్‌ చేసిన రీబౌండ్‌ ప్రయత్నాన్నీ అతడు నిలువరించాడు. చివరి నిమిషాల్లో కొరియా దాడులు కొనసాగించినా ఫలితం దక్కలేదు. స్టార్‌ ఆటగాడు సన్‌ హ్యూంగ్‌ మిన్‌ మరోసారి ప్రభావం చూపలేకపోగా, 57వ నిమిషంలో కోచ్‌ మ్యూంగ్‌ అతడిని వెనక్కి పిలిచి ప్రత్యామ్నాయ ఆటగాడిని రంగంలోకి దించాడు.

Advertisement

వివరాలు

గ్రూప్‌-ఎలో మెక్సికో అగ్రస్థానం..

టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 2-0తో గెలిచిన మెక్సికో, ఇప్పుడు దక్షిణ కొరియాపై విజయంతో మొత్తం ఆరు పాయింట్లు సాధించి గ్రూప్‌-ఎలో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. అలాగే గ్రూప్‌ విజేతగా కూడా నిలిచింది. ఓటమి ఎదురైనా దక్షిణ కొరియాకు నాకౌట్‌ అవకాశాలు ఇంకా బలంగానే ఉన్నాయి. ఇప్పటికే చెకియాపై విజయం సాధించిన ఆ జట్టు, చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ప్రస్తుతం మూడు పాయింట్లతో ఉన్న కొరియా ఆ మ్యాచ్‌ను కనీసం డ్రాగా ముగించినా నాకౌట్‌ బెర్త్‌ను దక్కించుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

Advertisement

వివరాలు

మెక్సికోతో తలపడనున్న చెకియా..

ఇక గ్రూప్‌లో మిగిలిన మరో మ్యాచ్‌లో మెక్సికోతో చెకియా తలపడనుంది. చెకియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగియడంతో ఆ రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ మాత్రమే ఉన్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియాకు ఇది వరుసగా 11వ ప్రపంచకప్‌, మొత్తంగా 12వ ప్రపంచకప్‌ టోర్నీ. 2002లో సెమీఫైనల్‌కు చేరుకోవడం ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

వివరాలు

డేవిడ్‌ హ్యాట్రిక్‌తో కెనడా భారీ విజయం..

వాంకోవర్‌లో జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో కెనడా 6-0తో ఖతార్‌ను చిత్తుగా ఓడించి ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. జోనాథన్‌ డేవిడ్‌ 29వ, 45+3, 90+2 నిమిషాల్లో గోల్స్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. కైల్‌ లారిన్‌ 16వ నిమిషంలో, నాథన్‌ సల్బా 64వ నిమిషంలో ఒక్కో గోల్‌ చేయగా, ఖతార్‌ ఆటగాడు మహ్మద్‌ మనై 75వ నిమిషంలో సెల్ఫ్‌ గోల్‌తో కెనడాకు మరో గోల్‌ అందించాడు. మొదటి అర్ధభాగం ముగిసే సమయానికే 3-0తో ఆధిక్యంలో ఉన్న కెనడా, రెండో అర్ధభాగంలో మరో మూడు గోల్స్‌ జోడించి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

వివరాలు

రెడ్‌ కార్డులతో ఖతార్‌కు కష్టాలు..

ఖతార్‌కు ఇద్దరు ఆటగాళ్లు రెడ్‌ కార్డులు చూడడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. హోమన్‌ అహ్మద్‌ 33వ నిమిషంలో, అసిమో మాదిబో 54వ నిమిషంలో మైదానం వీడడంతో దాదాపు రెండో అర్ధభాగమంతా ఖతార్‌ తొమ్మిది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కెనడా వరుస దాడులతో గోల్స్‌ నమోదు చేసింది. మ్యాచ్‌లో 65 శాతం బంతి కెనడా ఆధీనంలోనే ఉండగా, ప్రత్యర్థి గోల్‌పై మొత్తం 33 దాడులు చేసింది. నాలుగు పాయింట్లతో ఉన్న కెనడా నాకౌట్‌ అవకాశాలను దాదాపుగా ఖాయం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై కనీసం డ్రా సాధించినా గ్రూప్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంది.

వివరాలు

కోన్‌కు శస్త్రచికిత్స..

ఈ మ్యాచ్‌లో కెనడా మిడ్‌ఫీల్డర్‌ ఇస్మాయిల్‌ కోన్‌ గాయపడ్డాడు. ఖతార్‌ మిడ్‌ఫీల్డర్‌ అసిమో మాదిబో వెనుక నుంచి ట్యాకిల్‌ చేయడంతో కోన్‌ కిందపడిపోయాడు. అనంతరం అతడిని స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తరలించి స్థానిక ఆస్పత్రికి చేర్చారు. పరీక్షల్లో కాలికి విరుగు ఉన్నట్లు తేలడంతో వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు.

వివరాలు

బోస్నియాపై స్విట్జర్లాండ్‌ ఘన విజయం..

గ్రూప్‌-బిలో జరిగిన మరో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ 4-1తో బోస్నియా హెర్జెగోవినాపై సునాయాస విజయాన్ని అందుకుంది. స్విట్జర్లాండ్‌ తరఫున మంజాంబి 74వ, 90వ నిమిషాల్లో రెండు గోల్స్‌ చేయగా, రుబెన్‌ వర్గాస్‌ 84వ నిమిషంలో, గ్రానిట్‌ జికా 90+7వ నిమిషంలో ఒక్కో గోల్‌ నమోదు చేశారు. బోస్నియా తరఫున ఎమిన్‌ 90+3వ నిమిషంలో ఏకైక గోల్‌ సాధించాడు. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఉన్న స్విట్జర్లాండ్‌ కూడా కెనడాతో కలిసి ఈ గ్రూప్‌ నుంచి నాకౌట్‌కు చేరడం దాదాపు ఖాయమైంది. మరోవైపు ఒక్కో పాయింటుతో ఉన్న బోస్నియా, ఖతార్‌ జట్లు గోల్‌ వ్యత్యాసంలో వెనుకబడటంతో వారి అవకాశాలు క్లిష్టంగా మారాయి.

Advertisement