Michael Schumacher: కోమా నుంచి కోకోలుకున్న షూమాకర్.. ఆరోగ్యంపై కీలక నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
ఫార్ములా వన్ లెజెండ్ మైఖేల్ షూమాకర్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. స్కీయింగ్ ప్రమాదం జరిగి 12 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో, ఇప్పటివరకు ఊహించని ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. చాలా కాలంగా వైద్య గదికే పరిమితమైన షూమాకర్ ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితం కాకుండా బయటకు రావడం మొదలుపెట్టారని తాజా సమాచారం. ఈ మార్పు ఆయన కుటుంబం, సన్నిహితులు, అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. డైలీ మెయిల్ కథనం ప్రకారం,షూమాకర్ ఇప్పుడు తన ఇంట్లో వీల్‌చైర్ సాయంతో కదలగలుగుతున్నారని,నేరుగా కూర్చునే స్థితికి చేరుకున్నారని తెలుస్తోంది. గత 12 ఏళ్లుగా ఆయన జీవితం నాలుగు గోడల మధ్యే సాగినప్పటికీ, ఇప్పుడు ఈ స్థాయి పురోగతి సాధించడం విశేషంగా భావిస్తున్నారు.
వివరాలు
భర్తకు ప్రధాన సంరక్షకురాలిగా నిలిచిన కొరిన్నా షూమాకర్
ఇప్పటివరకు ప్రజలకు దూరంగా ఉంచిన ఆయన ఆరోగ్య ప్రయాణంలో ఇది పెద్ద మలుపుగా చెప్పవచ్చు. ఈ అభివృద్ధి యాదృచ్ఛికంగా జరగలేదని, ఆయన భార్య కొరిన్నా షూమాకర్ కృషి ఫలితమేనని కథనాలు చెబుతున్నాయి. భర్తకు ప్రధాన సంరక్షకురాలిగా నిలిచిన ఆమె, స్పెయిన్ మరియు స్విట్జర్లాండ్‌లోని తమ ఇళ్లలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆమె నేతృత్వంలో బలమైన సపోర్ట్ సిస్టమ్ పనిచేస్తోందని సమాచారం. షూమాకర్‌కు 24 గంటల పాటు వైద్య నిపుణుల పర్యవేక్షణ కొనసాగుతోంది. న్యూరాలజీ స్టిమ్యులేషన్, మానసిక చైతన్యం పెంపొందించే చికిత్సల్లో నైపుణ్యం కలిగిన థెరపిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులు ఆయనకు సేవలందిస్తున్నారు.
వివరాలు
షూమాకర్ కి రెండు అత్యవసర శస్త్రచికిత్సలు
అయితే ఇప్పటికీ షూమాకర్ మాట్లాడే సామర్థ్యం చాలా పరిమితంగానే ఉందని డైలీ మెయిల్ పేర్కొంది. అయినప్పటికీ, చుట్టూ జరుగుతున్న విషయాలపై ఆయనకు కొంత అవగాహన ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయట. తన పరిసరాలను కొంతవరకు అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవడం మరింత మెరుగైన కోలుకునే దిశగా ఆశలు పెంచుతోంది. ఈ దీర్ఘ ప్రయాణం 2013 డిసెంబర్ 29న ప్రారంభమైంది. ఫ్రాన్స్ ఆల్ప్స్‌లోని మెరిబెల్ రిసార్ట్‌లో స్కీయింగ్ చేస్తుండగా, అక్కడే ఓ రాయిని ఢీకొని షూమాకర్ పడిపోయారు. ప్రమాద తీవ్రత వల్ల ఆయనకు తీవ్రమైన మెదడు గాయం కాగా, రెండు అత్యవసర శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది.
వివరాలు
250 రోజులు కోమాలోనే..
హెల్మెట్ ఆయన ప్రాణాలను కాపాడినప్పటికీ, దాదాపు 250 రోజులు కోమాలోనే ఉండాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు షూమాకర్ కోలుకునే ప్రయాణం గోప్యత, పట్టుదలకి నిలువెత్తు ఉదాహరణగా కొనసాగుతోంది. తాజాగా బయటకు వచ్చిన ఈ సమాచారం, ఆయన అభిమానులకు మరోసారి ఆశ కిరణాన్ని చూపిస్తోంది.