LOADING...
Mohammad Rizwan: పీసీబీకి షాకిచ్చిన మ‌హ్మ‌ద్ రిజ్వాన్ .. మీ కాంట్రాక్ట్ నాకొద్దు.. నా కండిష‌న్స్ ఇవే..
మీ కాంట్రాక్ట్ నాకొద్దు.. నా కండిష‌న్స్ ఇవే..

Mohammad Rizwan: పీసీబీకి షాకిచ్చిన మ‌హ్మ‌ద్ రిజ్వాన్ .. మీ కాంట్రాక్ట్ నాకొద్దు.. నా కండిష‌న్స్ ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ స్టార్ వికెట్‌కీపర్‌, బ్యాటింగ్ సెన్సేషన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ మరోసారి చర్చల్లోకి వచ్చాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తాజాగా ప్రకటించిన 2025-26 సీజన్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌‌ను అతడు తిరస్కరించినట్టు సమాచారం బయటకు వచ్చింది. పీసీబీ విడుదల చేసిన 30 మంది ఆటగాళ్ల జాబితాలో రిజ్వాన్ మాత్రమే ఇప్పటివరకు సంతకం చేయలేదని పాక్ మీడియా కథనాలు చెబుతున్నాయి. సమాచారం ప్రకారం — వన్డే కెప్టెన్సీ నుంచి త‌న‌ను తప్పించటం, అలాగే టీ20 జట్టులో తన ఎంపిక విషయంలో జరిగిన వ్యవహారాలపై రిజ్వాన్ అసంతృప్తిగా ఉన్నాడట. ఈ నేపథ్యంలోనే పీసీబీతో చర్చల సందర్భంగా రిజ్వాన్ కొన్ని కండీషన్లు పెట్టినట్టు పాకిస్తాన్ మీడియా 'జియో సూపర్‌' రిపోర్ట్ చేసింది.

వివరాలు 

రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌ వంటి టాప్‌ ప్లేయర్లు 'ఏ' కేటగిరీలో..

ఆ షరతుల్లో మొదటిది.. సీనియర్‌, అత్యుత్తమ ప్రదర్శన చూపిస్తున్న ఆటగాళ్లను 'ఏ' కేటగిరీలో చేర్చాలని, ఆ జాబితాను తక్షణం పునరుద్ధరించాలని రిజ్వాన్ కోరాడట. రెండవది.. క్రొత్తగా నియమించబడే కెప్టెన్‌కు స్పష్టమైన పదవీకాలం ఇవ్వాలి, బోర్డు జోక్యం లేకుండా వారి ప్రణాళికలను అమలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉండాలి అని రిజ్వాన్ సూచించినట్టు తెలుస్తోంది. గతంలో రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌ వంటి టాప్‌ ప్లేయర్లు 'ఏ' కేటగిరీలో ఉండేవారు. అయితే ఈసారి పీసీబీ ఆ కేటగిరీని పూర్తిగా రద్దు చేసింది. దాంతో బాబర్‌, రిజ్వాన్‌లను 'బీ' కేటగిరీలోకి మార్చింది. ఇప్పుడు రిజ్వాన్ పెట్టిన ఈ కండీషన్లను పీసీబీ అంగీకరిస్తుందా లేదా అన్నది అభిమానులలో చర్చనీయాంశమైంది.

వివరాలు 

పాక్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితా ఇదే.. 

కేటగిరీ B: బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌, అబ్రార్‌ అహ్మద్‌, హారిస్‌ రవూఫ్‌, హసన్‌ అలీ, సైమ్‌ అయూబ్‌, సల్మాన్‌ అలీ ఆఘా, షాదాబ్‌ ఖాన్‌, షాహీన్‌ షా ఆఫ్రిది. కేటగిరీ C: అబ్దుల్లా షఫీక్‌, ఫహీమ్‌ అష్రఫ్‌, హసన్‌ నవాజ్‌, మహ్మద్‌ హారిస్‌,మహ్మద్‌ నవాజ్‌,నసీమ్‌ షా, నోమాన్‌ అలీ, సాహిబ్జాదా ఫర్హాన్‌, సాజిద్‌ ఖాన్‌, సౌద్‌ షకీల్‌. కేటగిరీ D: అహ్మద్‌ డానియల్‌, హుస్సేన్‌ తలత్‌, ఖుర్రం షాజాద్‌, ఖుష్దిల్‌ షా, మహ్మద్‌ అబ్బాస్‌, మహ్మద్‌ అబ్బాస్‌ ఆఫ్రిది, మహ్మద్‌ వసీం జూనియర్‌, సల్మాన్‌ మీర్జా, షాన్‌ మసూద్‌, సూఫియాన్‌ మొకీమ్‌. ఇప్పుడు రిజ్వాన్‌ తిరస్కరణతో పీసీబీ ఏమి నిర్ణయం తీసుకుంటుందో,ఆ క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.