Mohammed Shami: ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైన మహ్మద్ షమీ.. ఆ టోర్నీలో బ్యాటర్‌గా రాణించిన పేసర్!
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలో ఆస్ట్రేలియా పయనం కానున్నాడు. అతని ఫిట్‌నెస్ విషయంలో జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి అనుమతిపత్రం అందిన వెంటనే ఆస్ట్రేలియా వెళ్లి చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం షమి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతూ ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరూపించుకుంటున్నాడు. చండీగఢ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో షమి బ్యాటింగ్‌లో తన సామర్థ్యాన్ని చూపాడు. జట్టుకు పోరాడే స్కోరు అందించేందుకు చివర్లో 17 బంతుల్లో 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
64 టెస్టుల్లో 750 పరుగులు చేసిన షమీ
సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది జట్టును 159 పరుగుల వరకు చేర్చాడు. చండీగఢ్ లక్ష్య ఛేదనలో 156 పరుగులకే నిలిచింది. బెంగాల్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో షమి ఒక వికెట్ తీసి బౌలింగ్‌లోనూ తన సత్తా చాటాడు. షమీ సాధారణంగా ఒక పేసర్‌గా గుర్తింపు పొందినా, టెస్టు క్రికెట్లో విలువైన పరుగులు చేసి జట్టుకు తోడ్పడతాడు. 64 టెస్టుల్లో 750 పరుగులు చేసిన ఈ బెంగాల్ బౌలర్, 25 సిక్సర్లు బాది రెండు హాఫ్ సెంచరీలతో చరిత్ర సృష్టించాడు.
గాయం కారణంగా క్రికెట్ దూరమైన షమీ
గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత గాయంతో క్రికెట్‌కు దూరమైన షమీ, తాజాగా దేశవాళీ టోర్నీల్లో ఆడుతూ బౌలింగ్, ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ప్రదర్శనతో ఆకట్టుకుంటూ తనకు ఆసీస్ టెస్టుల జట్టులో చోటు దక్కిందని నిరూపించాడు. గాయం నుంచి పునరాగమనం చేసిన షమి వరుసగా మ్యాచ్‌లు ఆడి ఆరు కేజీల బరువు తగ్గాడు. తాను మరింత ఫిట్‌గా మారి జట్టుకు పూర్తి స్థాయి సేవలందించేందుకు సిద్ధమవుతున్నాడు. షమి, ఆసీస్ పర్యటనలో బ్యాట్, బంతితో మరోసారి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.